Advertisement

తనిఖీ కమిటీ రిపోర్టు పక్కకు పెట్టిన కేయూ రిజిస్ట్రార్ మల్లారెడ్డి

  • వరుస జోర్దార్ కథనాలతో ఫార్మసి కాలేజీల తనిఖీలు
  • వెలుగుచూసిన అబ్బురపరిచే నిజాలు
  • తనిఖీ రిపోర్టులో మళ్ళా రెడ్డి చేతి వాటం 
  • ఇష్టానుసారంగా ఫార్మసీ సీట్లలో కోత
  • గతంలో విచ్చల విడిగా ఫాం డీ కోర్సుల అనుమతులు …ఇప్పుడు కోత

హన్మకొండ జోర్దార్ ప్రతినిధి:   యూనివర్సిటీ పరిదిలో మొత్తం 24 ఫార్మసీ కాలేజీలు ఖమ్మం, జనగామ, వరంగల్, నర్సంపేట తదితర ప్రాంతాల్లో పని చేస్తున్నాయి. ఈ కాలేజీలకు బీ.ఫార్మసీ, ఎం.ఫార్మసీ, డీ ఫాం కోర్సుల అనుమతుల్లో ప్రతి సంవత్సరం భారీగా అవినీతి చోటు చేసుకుంటుందని వార్తలు వెలువడ్డాయి. గత సంవత్సరం ప్రో.తాటికొండ రమేష్ వీసీగా వున్నప్పుడు తనిఖీల కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా ఆ యా కాలేజీల్లో వివిధ కోర్సులకు అక్రమంగా అనుమతులు ఇచ్చారని, కాలేజీ యాజమాన్యం నుండి లక్షల్లో డబ్బు చేతులు మారిందని వార్తలు వెలువడ్డాయి. ముఖ్యంగా ఫాం డీ కోర్సు అనుమతులు ఇవ్వాలంటే పీ.సి.ఐ నిబంధనల ప్రకారం కాలేజీకి 300 పడకలు వున్న ఒక హాస్పిటల్ తో ఎం.వో.యు. వుండాలి. కాని అవేమీ లేకుండానే ఆరు కాలేజీలకు అక్రమంగా డబ్బులు దండుకొని వీసీ రమేష్ ఫాం డీ కోర్సులకు అనుమతులు ఇచ్చారని ప్రభుత్వానికి కొందరు ఫిర్యాదు కూడా చేసారు. ఒక తనిఖీ బృందం ఆ కాలేజీలకు 300 పడకల హాస్పిటల్ తో ఎం.వో,యు లేదని ఫాం డీ కోర్సు అనుమతి ఇవ్వలేదు. వాటికి అనుమతులు ఇవ్వడానికి తవ అవినీతికి వంతు పాడే ఫ్యాకల్టీ (ప్రొఫ్.సదానందం, డా రాధిక) లతో తనిఖీ చేయించి ఆ కాలేజీలకు అనుగుణంగా రిపోర్టు రాయించుకొని ఫాం డీ కోర్సులకు అనుమతులు ఇచ్చిన విషయం గతంలో సంచలనం కల్గించింది. ఆ తర్వాత మాజీ వీసీ రమేష్ అవినీతి అక్రమాలపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఫార్మసీ కాలేజీలను తనిఖీలు చేస్తే మళ్ళీ ఇబ్బందులు ఎదురవుతాయని ఎటువంటి తనిఖీలు లేకుండానే ఆయా కోర్సుల్లో అంతకు ముందు ఉన్నట్లే సీట్ల సంఖ్యను మంజూరు చేద్దామని వీసీ రమేష్ రమేష్ తర్వాత రిజిస్ట్రార్ గా వచ్చిన ప్రో.మల్లారెడ్డి నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కాని సరయిన ఫ్యాకల్టీ, పరిశోధనా పరికరాలు, హాస్పిటల్ తో అనుబంధం లేకుండానే గతంలో వీసీ రమేష్ అనుమతులు ఇచ్చారు వాటినన్నింటినీ పునః సమీక్షించాలనే డిమాండ్ మరియు కేయూ ఫార్మసీ కాలేజీ డీన్ నుండి వినతులు వచ్చిన కారణంగా ప్రో.మల్లారెడ్డికి ఇష్టం లేకున్నా ఫార్మసీ కాలేజీల తనిఖీ చేపట్టాల్సి వచ్చింది.

తనిఖీల్లో వెలుగుచూసిన అబ్బుర పరిచే నిజాలు

రెండు బృందాలుగా విడిపోయి 24 ఫార్మసీ కాలేజీలను నాలుగు రోజుల్లో తనిఖీలు పూర్తిచేసి ఆ యా తనిఖీ బృందాలు తనిఖీ రిపోర్టును రిజిస్ట్రార్ మరియు సి.డీ.సి డీన్ లకు సమర్పించారు. గతంలో 300 పడకల హాస్పిటల్ తో అనుబంధం లేకున్నా కొన్ని కాలేజీలకు ఫాం డీ కోర్సుల అనుమతులు ఇచ్చారని తేలింది. ఖమ్మం లోని మహమ్మదీయ ఫార్మసీ కాలేజీ, ఖమ్మం ఫార్మసీ కాలేజీ, వరంగల్ లోని పాత్ ఫైండర్, సహస్ర ఫార్మసీ కాలేజీలకు ఈ సంవత్సరం తనిఖీలు చేసిన కమిటీ ఫాం డీ కోర్సుల అనుమతులను రద్దు చేసింది. కాని కొన్ని కాలేజీలకు 300 పడకల హాస్పిటల్ తో అనుబంధం లేకున్నా ఫాం డీ కోర్సుకు అనుమతులు ఇచ్చి 20 సీట్లు మాత్రమె ఇచ్చారు. వాటిలో నర్సంపేట లోని బిప్స్, బొల్లికుంట లోని వాగ్దేవి, వరంగల్ లోని శివాని, జయముఖి, నేతాజీ మరియు ఎస్.ఆర్.ఆర్ ఫార్మసీ కాలేజీలున్నట్టు సమాచారం. ఖమ్మంలోని మూడు కాలేజీల్లో ఎం.ఫార్మసీ కోర్సుల అనుమతి రద్దు చేసారు. ఈ కాలేజీల నుండి రాజకీయ సిఫార్సులుతో ఇంచార్జీ వీసీ వాకాటి కరుణ మళ్ళీ తనిఖీలు చేయాల్సిందిగా మౌఖిక ఆదేశాలు జారీ చేసిన కారణంగా రెండవసారి తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం.

కమిటీ సిఫార్సులను పక్కకు పెట్టిన రిజిస్ట్రార్ ప్రో.మల్లారెడ్డి

వరంగల్ లోని కేర్ ఫార్మసీ కాలేజీ, ఖమ్మంలోని బ్రౌన్స్ ఫార్మసీ కాలేజీలకు సరయిన వసతులు అన్నీ ఉన్నప్పటికీ ఈ కాలేజీల్లో ఫాం డీ కోర్సుకు 30 సీట్లు కమిటీ సిఫార్సు చేసినప్పటికీ కమిటీ సిఫార్సులను పక్కన పెట్టి రిజిస్ట్రార్ ప్రో మల్లారెడ్డి ఈ రెండు కాలేజీలకు కేవలం 20 సీట్లు ఇచ్చి కమిటీ సిఫార్సులను తుంగలో తొక్కారని సమాచారం. ఐదుగురు ప్రొఫెసర్లు వున్న కమిటీ సిఫార్సులను పక్కన ఎందుకు పెట్టాల్సి వచ్చిందని ఆ రెండు కాలేజీలతో ప్రో.మల్లారెడ్డి కి ఏమయినా వ్యక్తిగత కక్షలు ఉన్నాయా అనేది చర్చగా మారింది. ఖమ్మం లోని అతి పెద్ద ప్రభుత్వ హాస్పిటల్ తో అనుబంధం వున్న బ్రౌన్స్ కాలేజీ కి మరియు 300 పడకల హాస్పిటల్ తో అనుబంధం వున్న కేర్ ఫార్మసీ కాలేజీ కు ఫాం డీ కోర్సుల్లో సీట్ల కోతపై ప్రో.మళ్ళా రెడ్డి కక్ష పూరిత చర్యలకు పాల్పడ్డారని పలువురు అభిప్రాయ పడుతున్నారు. అలాంటప్పుడు ప్రభుత్వ డబ్బు ఖర్చు పెట్టి తనిఖీలు చేయాల్సిన అవసరం లేదని రిజిస్ట్రార్ మలారేడ్డి తన ఇష్టానుసారంగా ఫార్మసీ కాలేజీలకు గతంలో లాగా సీట్లు ఇచ్చుకుంటే సరిపోయేదనే విమర్శలు కూడా వస్తున్నాయి.

ఇష్టానుసారంగా ఫార్మసీ సీట్లలో కోత

గత సంవత్సరం అన్ని ఫార్మసీ కాలేజీల్లో బీ.ఫార్మసీ కోర్సుకు 100 సీట్లకు అనుమతులు ఇచ్చారు. ఈ సంవత్సరం తనిఖీలు చేపట్టిన తర్వాత మూడు కాలేజీలకు 20 సీట్ల కోత విధించారు. మరో మూడు కాలేజీలకు 40 సీట్ల కోత విధించారు. తనిఖీ బృందం సిఫార్సులను పూర్తిగా పక్కన పెట్టి రిజిస్ట్రార్ ప్రో మల్లారెడ్డి సీట్లను తగ్గించడాన్ని కాలేజీ యాజమాన్యాలు తప్పు బట్టాయి. ఏకంగా యూనివర్సిటీకి వచ్చి వాగ్వాదాలు చేసినట్లు సమాచారం. అన్ని వసతులు ఉన్నప్పటికీ అనుమతులు ఇవ్వకపోవడం వెనుక మతలబు ఏమిటని ప్రశ్నించినట్లు సమాచారం. ఒక కమిటీ కొన్ని కాలేజీలకు బీ.ఫార్మసీ కోర్సుకు 80 సీట్లు అనుమతి ఇస్తే వాటిలో ప్రో.మలారెడ్డి 20 సీట్ల కోత విధించారు. అదే విధంగా మరో కమిటీ కొన్ని కాలేజీలకు బీ.ఫార్మసీ కోర్సుకు 100 సీట్లు కేటాయిస్తే వాటికి 40 సీట్ల కోత విధించారు. కమిటీ సిఫార్సులను పక్కన పెట్టి సీట్లను ఎలా తగ్గిస్తారని పలు కాలేజీ యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నాయి. రిజిస్ట్రార్ ప్రో.మల్లారెడ్డి నిరంకుశ వైఖరిని కాలేజీ యాజమాన్యాలు ముక్త కంటంతో ఖండిస్తున్నాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *