Advertisement

హనుమకొండ హోమ్ నుంచి 17 వీళ్ళ బాలిక పరార్…

పోక్సో బాధితురాలు.. అదృశ్యం అధికారులపై ఆరోపణలు…

*హనుమకొండ హోమ్ నుంచి 17 వీళ్ళ బాలిక పరార్…

22 రోజులు దాచిపెట్టిన హనుమకొండ అధికారులు…

పోలీస్ ఫిర్యాదుతో అక్కడ వేసిన గొంగళి అక్కడే….

 హనుమకొండ కలెక్టర్ గారు జర దేకో….

హన్మకొండ జోర్దార్ నిఘా విభాగం:

పోక్సో కేసులో బాధితురాలిగా ఉన్న బాలిక హన్మకొండ జిల్లాలోని స్వధర్ హోమ్ నుంచి అదృశ్యమై సుమారు 15 రోజులు గడిచినా, ఆమె ఆచూకీ మరియు భద్రతకు సంబంధించి అధికారులు సమర్థవంతమైన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాలిక రక్షణకు సంబంధించిన అత్యంత సున్నితమైన అంశంలో ఇంతకాలం గడిచినా స్పష్టమైన చర్యలు కనిపించకపోవడంపై బాలల సంక్షేమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాలల రక్షణ, ముఖ్యంగా పోక్సో కేసుల్లో బాధిత బాలికల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ, హన్మకొండ జిల్లాలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉందని బాలల సంక్షేమ సంఘాల ప్రతినిధులు విమర్శిస్తున్నారు.

బాలిక అదృశ్యంపై సమాచారం గోప్యంగా ఉంచారా?

బాలిక స్వధర్‌ హోమ్‌ నుంచి వెళ్లిపోయిన విషయం కింది స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు తగిన విధంగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు జిల్లా కలెక్టర్‌కు వెంటనే అందించారా? బాలిక అదృశ్యమైన వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారా? ఆమెను గుర్తించేందుకు తీసుకున్న చర్యలు ఏమిటి? అనే అంశాలపై స్పష్టత ఇవ్వాలని బాలల సంక్షేమ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.. బాధితురాలు పోక్సో కేసుకు సంబంధించిన బాలిక కావడంతో, ఆమె భద్రత విషయంలో సాధారణ నిర్లక్ష్యానికంటే మరింత తీవ్రమైన బాధ్యత అధికారులపై ఉంటుందని వారు పేర్కొంటున్నారు.

స్వధర్ హోమ్ నిర్వహణపై కూడా ఆరోపణలు...

ఇదిలా ఉండగా, స్వధర్‌ హోమ్‌ నిర్వహణకు సంబంధించి కూడా గతంలో పలు ఆరోపణలు వచ్చినట్లు బాలల సంక్షేమ వర్గాలు పేర్కొంటున్నాయి. హోమ్‌లోని బాలికలు ఫోన్‌లో మాట్లాడుకునే విషయంలో అనుమతులు కల్పిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు గతంలో వచ్చినట్లు వారు చెబుతున్నారు. ఈ అంశంపై గతంలో అధికారులు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ పరిస్థితిలో ఆశించిన మార్పు రాలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలపై అధికారికంగా విచారణ జరిపి వాస్తవాలను నిర్ధారించాల్సిన అవసరం ఉందని బాలల సంక్షేమ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి.

బాధ్యులపై చర్యలు ఎప్పుడు?…

గతంలో ములుగు జిల్లాలో బాలల సంరక్షణకు సంబంధించిన ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చినప్పుడు అప్పటి జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకున్న విషయాన్ని బాలల సంక్షేమ వర్గాలు గుర్తుచేస్తున్నాయి. అయితే హన్మకొండ జిల్లాలో బాలిక అదృశ్యమైన ఘటనకు సంబంధించి ఇప్పటివరకు బాధ్యత నిర్ధారణ లేదా స్పష్టమైన చర్యలు కనిపించకపోవడం పట్ల వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బాలిక ఆచూకీ కోసం ఇప్పటివరకు చేపట్టిన చర్యలు, పోలీసులకు ఇచ్చిన సమాచారం, అధికారుల మధ్య జరిగిన సమాచార మార్పిడి, హోమ్‌ నుంచి బాలిక బయటకు వెళ్లిన పరిస్థితులు తదితర అంశాలపై సమగ్ర విచారణ జరపాలని వారు కోరుతున్నారు.

అధికారుల పనితీరుపై సమీక్ష చేయాలి.. 

జిల్లా బాలల సంక్షేమ, సంరక్షణ వ్యవస్థలో అనుభవం మరియు సమన్వయం లోపించడం వల్లే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. బాలల సంరక్షణకు సంబంధించిన కీలక విభాగాల్లో పనిచేస్తున్న అధికారుల పనితీరును ఉన్నతాధికారులు సమీక్షించాలని, అవసరమైతే అనుభవజ్ఞులైన అధికారులను నియమించాలని బాలల సంక్షేమ సంఘాల ప్రతినిధులు డిమాండ్‌ చేస్తున్నారు.

ముగ్గురు అధికారుల పాత్రపై విచారణ జరపాలి…

పోక్సో బాధితురాలు స్వధర్ హోమ్‌ నుంచి అదృశ్యమైన ఘటనలో స్వధర్ హోమ్‌ ఇన్‌చార్జి, సంబంధిత బాలల హక్కుల పరిరక్షణ సమన్వయకర్త జిల్లా బాలల పరిరక్షణ అధికారి వారి పాత్ర, బాధ్యత, పర్యవేక్షణలో లోపాలు ఉన్నాయా అనే అంశాలపై సమగ్ర విచారణ జరిపించాలని బాలల సంక్షేమ సంఘాలు కోరుతున్నాయి. బాలిక హోమ్‌ నుంచి బయటకు వెళ్లిన సమయం, హాజరు రిజిస్టర్‌, సీసీ కెమెరా రికార్డులు అందుబాటులో ఉన్నాయా, హోమ్‌ సిబ్బంది తీసుకున్న చర్యలు, పోలీసులకు సమాచారం ఇచ్చిన సమయం, ఉన్నతాధికారులకు సమాచారం చేరిన సమయం తదితర అంశాలను పరిశీలించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

బదిలీ పోస్టింగ్‌పై కూడా స్పష్టత ఇవ్వాలి….

ఇదిలా ఉండగా, ప్రస్తుత హన్మకొండ బాలల హక్కుల పరిరక్షణ సమన్వయకర్తకు సంబంధించి గత బదిలీల సమయంలో జరిగిన పోస్టింగ్‌ వ్యవహారంపైనా పలువురు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. గతంలో రెండో బహుళ మండల పరిధిలోని తుంగతుర్తి, సూర్యాపేట జిల్లాకు బదిలీ అయిన అనంతరం తిరిగి మొదటి బహుళ మండల పరిధిలోని హన్మకొండలోనే పోస్టింగ్‌ పొందిన వ్యవహారంపై పూర్తి వివరాలను అధికారులు వెల్లడించాలని వారు కోరుతున్నారు.

ఈ పోస్టింగ్‌ నిబంధనల ప్రకారమే జరిగిందా? బదిలీ ఉత్తర్వులు ఎలా ఉన్నాయి? ఏ ప్రాతిపదికన తిరిగి పోస్టింగ్‌ ఇచ్చారు? అనే అంశాలపై పారదర్శకంగా విచారణ జరపాలని డిమాండ్‌ చేస్తున్నారు. రాజకీయ పలుకుబడితో పోస్టింగ్‌ జరిగిందనే ఆరోపణలు నిజమా కాదా అన్నది కూడా అధికారిక విచారణ ద్వారానే తేల్చాలని వారు పేర్కొంటున్నారు.

కలెక్టర్‌ తక్షణమే స్పందించాలి….

పోక్సో బాధితురాలి అదృశ్యం సాధారణ ఘటన కాదని, బాలిక భద్రతకు సంబంధించిన అత్యంత సున్నితమైన అంశమని బాలల సంక్షేమ సంఘాలు పేర్కొంటున్నాయి. జిల్లా కలెక్టర్‌ తక్షణమే ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించి బాలిక ఆచూకీ కోసం తీసుకున్న చర్యలను సమీక్షించాలని, స్వధర్ హోమ్ నిర్వహణపై విచారణ జరిపించాలని, బాలిక అదృశ్యమైన పరిస్థితులను పూర్తిగా వెలుగులోకి తేవాలని, సంబంధిత అధికారుల బాధ్యతను నిర్ధారించాలని, నిర్లక్ష్యం లేదా విధి నిర్వహణలో లోపం ఉన్నట్లు తేలితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని, పోక్సో బాధితురాలికి అవసరమైన రక్షణ, పునరావాసం కల్పించేలా చర్యలు చేపట్టాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

బాధిత బాలిక ఆచూకీ, భద్రత విషయంలో ఎలాంటి ఆలస్యం జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని, ఘటనపై వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని బాలల సంక్షేమ సంఘాలు కోరుతున్నాయి. అధికారులు స్పందించకపోతే ఈ అంశాన్ని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ సంస్థ, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంస్థతో పాటు సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని వారు హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *