Advertisement

ప్రాణ భయం ఉందన్నా.. పట్టించుకోరా..?

  • ప్రాణ భయం ఉందన్నా.. పట్టించుకోరా..?
  • ఇద్దరు మహిళా అధ్యాపకులు ఫిర్యాదు చేసి పది రోజులు దాటినా చర్యలేవి ?
  • చర్యలు తీసుకోవాలంటే జరగకూడని దారుణాలు జరిగిపోవాలా ?
  • శ్రీధర్ కుమార్ లోథ్ పై చర్యలు తీసుకోవడంలో ఎందుకీ జాప్యం…

హన్మకొండ జోర్ధార్ ప్రతినిథి: కాకతీయ యూనివర్సిటీలో డీన్ (వీసీ, రిజిస్ట్రార్ తర్వాతి) స్థాయిలో ఉన్న మహిళా ప్రొఫెసర్ జ్యోతి, మరో పార్ట్ టైం మహిళా లెక్చరర్ అన్నపూర్ణ తమకు కాంట్రాక్ట్ శ్రీధర్ కుమార్ లోథ్ తో ప్రాణ భయం ఉందంటూ తీవ్రమైన ఆరోపణలతో రాతపూర్వకంగా ఫిర్యాదు చేసి పది రోజులవుతున్నా అధికార యంత్రాంగం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అత్యున్నత విద్యాసంస్థలో అందులోనూ దళితులైన ఇద్దరు మహిళా అధ్యాపకులను ఓ కాంట్రాక్ట్ లెక్చరర్ బెదిరింపులకు దిగితే.. యూనివర్సిటీ ఇన్ చార్జీ వీసీ, రిజిస్ట్రార్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు చర్యలు తీసుకోవాలంటే ఇంతకు మించిన దారుణాలు జరిగిపోవాలా ? అలా జరిగితేగానీ చర్యలు తీసుకోరా అనే విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. శ్రీధర్ కుమార్ లోథ్ పై గతంలోనూ అనేక ఫిర్యాదులు అందాయని, అప్పటి వీసీ రమేష్ వాటిని తొక్కిపెట్టారని గుర్తు చేస్తున్నారు.

తెలుగు డిపార్ట్ మెంట్ లో ఏం జరిగిందంటే..

ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో పని చేస్తున్న తెలుగు కాంట్రాక్ట్ లెక్చరర్ కర్రె సదాశివ్ , మహిళా పీజీ కాలేజీలో పని చేస్తున్న పార్ట్ టైం లెక్చరర్ అన్నపూర్ణ యూనివర్సిటీ క్యాంపస్ కు వచ్చేందుకు కొన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నారు. అయితే కొత్త వీసీ వచ్చాక ట్రాన్స్ ఫర్ల విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంలో తెలుగు విభాగాధిపతి ప్రొఫెసర్ జ్యోతి ఉన్నారు. ఈ క్రమంలోనే కాంట్రాక్టర్ లెక్చరర్ సంఘం శ్రీధర్ కుమార్ లోథ్, కర్రె సదాశివ్ ఈ నెల 14న తెలుగు విభాగానికి వెళ్లి రెండు గంటలపాటు ట్రాన్స్ ఫర్ విషయమై దుర్భాషలాడారు. చేతకాకుంటే పదవికి రాజీనామా చేయాలని, సీటు వదిలిపోవాలని బెదిరింపులకు దిగినట్లు ప్రొఫెసర్ జ్యోతి ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు రెండు గంటలపాటు తన చాంబర్ లో కూర్చుని కదల్లేదని, తనను ఏ పని చేసుకోనివ్వకుండ ఇబ్బందులకు గురి చేసినట్లు చెప్పారు. శ్రీధర్ కుమార్ లోథ్ తో తనకు ప్రాణహానీ ఉందని, తనకు ఏం జరిగినా వీరిదే బాధ్యత అని, చాలా బాధతో వేదనతో తెలియజేస్తున్నట్లు ఇన్ చార్జీ వీసీ వాకాటి కరుణ, రిజిస్ట్రార్ మల్లారెడ్డికి ఈ నెల 16న ఫిర్యాదు చేశారు. దీంతో శ్రీధర్, సదాశివ్ కు 17న షోకాజ్ నోటీసులు ఇచ్చారు. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో ఆదేశించారు. దీంతో వారు వివరణ కూడా ఇచ్చినట్లు తెలిసింది.

అన్నపూర్ణ ఫిర్యాదును తొక్కిపెట్టిన రిజిస్ట్రార్…

ఈ క్రమంలోనే ఈ నెల 17న అన్నపూర్ణ అనే తెలుగు విభాగం పార్ట్ టైం లెక్చరర్ శ్రీధర్ కుమార్ లోథ్ తనను ఉద్యోగం నుంచి తీయించేస్తానని బెదిరింపులకు దిగినట్లు, దళిత మహిళ అనే కారణంతో ఆఫ్ర్టాల్ పార్ట్ టైం లెక్చరర్ అని అవమానించాడని, అతడి నుంచి తనకు ప్రాణ హానీ ఉందని రాతపూర్వకంగా రిజిస్ట్రార్ కు ఫిర్యాదు చేశారు. అన్నపూర్ణ ఫిర్యాదుపై కూడా శ్రీధర్ కుమార్ లోథ్ కు మరో షోకాజ్ నోటీసు ఇవ్వాల్సి ఉంది. కానీ అలాంటిదేమి చేయకుండ రిజిస్ట్రార్ మల్లారెడ్డి ఆ ఫిర్యాదును తొక్కిపట్టడం, ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అన్నపూర్ణ ఫిర్యాదును ఇన్ చార్జీ వీసీ వాకాటి కరుణ దృష్టికి కూడా తీసుకెళ్లలేదని తెలిసింది. మరుసటి రోజు పత్రికల్లో వచ్చిన వార్తలను చూసి.. ఇన్ చార్జీ వీసీ కరుణ ఆ కంప్లయింట్ ను తెప్పించుకున్నట్లు సమాచారం. ఓ టీచర్ ఎమ్మెల్సీ చేసిన పైరవీ మేరకు రిజిస్ట్రార్ మల్లారెడ్డి శ్రీధర్ కమార్ లోథ్ ను కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *