Advertisement

మానసిక శుద్ధికి ధ్యానమే మార్గం

ధ్యానంతోనే మానసిక శుద్ధి…
_ప్రో. అచ్చయ్య, యోగా ట్రైనర్

జోర్దార్ వరంగల్ ప్రతినిధి (20.12.2025):

డీన్ స్టూడెంట్ అఫైర్స్, యోగా సెంటర్ ఆధ్వర్యంలో హార్ట్ ఫుల్ నెస్ సంస్థ సహకారంతో జరుగుతున్న మూడు రోజుల వర్క్ షాప్ లో భాగంగా రెండవ రోజు ధ్యానంపై శిక్షణ విజయవంతంగా ముగిసింది. రెండవ రోజు మొదటి సెషన్‌లో, కాకతీయ యూనివర్సిటీ ఫార్మసీ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ ప్రో. జి. ఆచ్యయ్య “రెజువినేషన్, నిర్మలీకరణ” అంశంపై ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ, మన ఆలోచనలు మరియు మనస్సు ఎలా పనిచేస్తాయన్న విషయాన్ని వివరించారు. అనవసరమైన, ఉపయోగం లేని ఆలోచనలపై మనం ఎక్కువగా దృష్టి పెట్టడం వల్ల మన భావోద్వేగాలు, నిర్ణయాలు, ఏకాగ్రతపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పారు. ప్రతి ఒత్తిడిగల అనుభవం మన మెదడులో భావోద్వేగ ముద్రలను వదిలిపెడుతుందని, ఇవి కాలక్రమంలో మన వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తాయని న్యూరోసైన్స్ ఆధారంగా వివరించారు. ఈ మానసిక మలినాలను తొలగించేందుకు హార్ట్ ఫుల్ నెస్ నిర్మలీకరణ ప్రక్రియ ఎంతో ఉపయోగకరమని, ఇది మనలోని లోతైన భావోద్వేగ ముద్రలను శుద్ధి చేస్తుందని తెలిపారు. ప్రో. జి. ఆచయ్య గారు శాస్త్రీయ దృష్టికోణం నుండి క్లీనింగ్ ప్రక్రియలో మెదడు ఎలా స్పందిస్తుందో కూడా విశదీకరించారు. ఆయన వివరించిన ప్రకారం, హార్ట్‌ఫుల్‌నెస్ క్లీనింగ్ సమయంలో సింపథటిక్ నర్వస్ సిస్టమ్ క్రియాశీలత తగ్గి, ప్యారాసింపథటిక్ స్పందన పెరుగుతుంది, ఇది శరీరాన్ని విశ్రాంత స్థితిలోకి తీసుకెళ్తుంది. ప్రీఫ్రంటల్ కార్టెక్స్ నియంత్రణ మెరుగవడం వల్ల మన నిర్ణయాలు, ఏకాగ్రత, భావోద్వేగ నియంత్రణ మెరుగవుతాయని చెప్పారు. ఎలక్ట్రో ఎన్సాఫాలో గ్రామ్ అధ్యయనాల ప్రకారం, హార్ట్‌ఫుల్‌నెస్ సాధన సమయంలో ఆల్ఫా మరియు థీటా తరంగాలు పెరిగి, ఒత్తిడికి సంబంధించిన బీటా తరంగాలు తగ్గుతాయని, ఇది మనస్సు ప్రశాంతతతో పాటు అప్రమత్తతను కలిగిస్తుందని వివరించారు. ఈ శాస్త్రీయ ఆధారాలు హార్ట్‌ఫుల్‌నెస్ క్లీనింగ్ ప్రక్రియ యొక్క ప్రభావాన్ని బలంగా సూచిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

హార్ట్‌ఫుల్‌నెస్ ట్రైనర్ శ్రీ ఎస్. శాంతి స్వరూప్ గారు “తప్పుడు ఆలోచనలు” మరియు “ఇష్టాలు, అయిష్టాలు” అనే అంశాలపై ఆసక్తికరమైన దృక్కోణాన్ని అందించారు. ఆయన మాట్లాడుతూ, ఒకసారి తప్పు ఆలోచనలు కలిగితే అవి మన ఆలోచనా ధోరణిని ప్రభావితం చేస్తాయని, “నేను ఏకాగ్రత సాధించలేను”, “నేను ఎప్పుడూ తప్పు చేస్తాను”, “ఈ విషయం నాకు సరిపోదు” వంటి భావాలు మన సామర్థ్యాన్ని తగ్గిస్తాయని వివరించారు. అలాగే, మనకు ఇష్టమైన విషయాలు తక్షణ ఆనందాన్ని కలిగిస్తూ డోపమైన్ అనే రసాయనాన్ని ప్రేరేపిస్తాయని, దాని ద్వారా తప్పించుకోవడం, భావోద్వేగ పరారితనం వంటి అలవాట్లు మనలో స్థిరపడతాయని చెప్పారు. అదే సమయంలో, మనకు ఇష్టంలేని అనుభవాలు—విఫలత భయం, గత అవమానాలు, విమర్శలు, పోలికలు—భావోద్వేగ ముద్రలుగా నిలిచి, మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా తిరిగి తిరిగి గుర్తుకు వస్తాయని వివరించారు. ఈ అంతర్గత మానసిక ధోరణులను హార్ట్ ఫుల్ నెస్ క్లీనింగ్ ద్వారా తొలగించవచ్చని, ఇది మన ఆలోచనలను శుద్ధి చేసి, సానుకూల దృక్కోణాన్ని పెంపొందించేందుకు దోహదపడుతుందని ఆయన స్పష్టం చేశారు. చివరి సెషన్ లో హార్ట్ ఫుల్ నెస్ సంస్థ ట్రైనర్ డా. రాంబాబు విద్యార్థులకు మెడిటేషన్ చేయించారు.

*ఆదివారం ముగింపు కార్యక్రమం…*

మూడు రోజుల వర్క్ షాప్ ముగింపు ఆదివారం ఉంటుందని, చివరి రోజు వక్తలు ప్రకృతితో ఏ విధంగా సంధానం కావాలి అనే అంశంపై శిక్షణ ఇస్తారని, ముఖ్య అతిథిగా కేయూ రిజిస్ట్రార్ ప్రో. వీ. రామచంద్రం పాల్గొంటారని, మూడు రోజుల పాటు పాల్గొన్న విద్యార్థులందరికీ సర్టిఫికెట్ల ప్రధానం ఉంటుందని డీన్ స్టూడెంట్ అఫైర్స్ ప్రో మామిడాల ఇస్తారి ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థి నిర్వహణ కమిటీ సభ్యులు హరివర్ధన్, ప్రకాష్, ఋగ్వేది రావు, కందగట్ల వికాస్, దేవీ ప్రసాద్, అలోక్, శృతి, నరేందర్, నవ్య, లిఖిత, గాయత్రి, లీనశ్రీ, అహల్య, సోఫియా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *