|
(వరంగల్ జోర్దార్ విద్యా విభాగం, 29 డిసెంబర్ 2026):
రాష్ట్రంలో రెండవ అతి పెద్ద యూనివర్సిటీగా గుర్తింపు పొందిన కాకతీయ యూనివర్సిటీలో అకడమిక్ వ్యవస్థ తీవ్ర అవ్యవస్థకు లోనవుతోందన్న ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. ముఖ్యంగా పీజీ బయోటెక్నాలజీ విభాగంలో ఇటీవల నిర్వహించిన ప్రాక్టికల్ పరీక్షలు, యూనివర్సిటీ చరిత్రలోనే అత్యంత వివాదాస్పద ఘటనలుగా మారాయి. పరీక్షల నిర్వహణ నుంచి ఫలితాల విడుదల వరకు ఒకే వ్యక్తుల ఆధిపత్యంలో సాగుతున్న వ్యవహారం, అకడమిక్ నైతిక విలువలను పూర్తిగా తుంగలో తొక్కినట్టుగా ఉందని విద్యార్థులు, అధ్యాపకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాకతీయ యూనివర్సిటీలో పీజీ కోర్సుల ప్రాక్టికల్ పరీక్షలు ప్రతి సెమిస్టర్ ముగింపులో యూనివర్సిటీతో పాటు అనుబంధ, ప్రైవేటు కళాశాలల్లో నిర్వహించబడుతున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించిన మార్కుల నమోదు, మెమోల తయారీ, ఫలితాల ప్రకటన మొత్తం యూనివర్సిటీ పరీక్షల విభాగం ఆధ్వర్యంలో జరుగుతోంది. అయితే పరీక్షల నిర్వహణను పర్యవేక్షించే అధికారులే ఎగ్జామినర్లుగా వ్యవహరించడం, అదే మార్కులను తామే నమోదు చేసి ఫలితాలు ప్రకటించడం స్పష్టమైన స్వార్థ ప్రయోజనాల ఘర్షణగా మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇటీవల కేయూ బయోటెక్నాలజీ విభాగంలో జరిగిన ప్రాక్టికల్ పరీక్షల్లో పీజీ పరీక్షల విభాగం అడిషనల్ కంట్రోలర్, అదే విభాగానికి చెందిన బోర్డ్ ఆఫ్ స్టడీస్ సభ్యుడిగా ఉండి, తనే కంట్రోలర్‌గా ఎగ్జామినర్ ఆర్డర్‌పై సంతకం చేసి, తనే ప్రాక్టికల్ ఎగ్జామినర్‌గా వ్యవహరించడం తీవ్ర దుమారం రేపింది. పరీక్షల నిర్వహణకు నియమించబడిన అధికారి, తానే ఎగ్జామినర్‌గా వ్యవహరించడం యూజీసీ నిబంధనలకు, అకడమిక్ సంప్రదాయాలకు విరుద్ధమని పలువురు సీనియర్ అధ్యాపకులు స్పష్టం చేస్తున్నారు.
ఇదే పరీక్షల సమయంలో, అధికారికంగా ఎగ్జామినర్‌గా పేరు లేని ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్, నియమిత ఎగ్జామినర్ తయారు చేసిన ప్రశ్నపత్రాన్ని తిరస్కరించి, తాను ముందుగానే సిద్ధం చేసుకున్న ప్రశ్నపత్రంతో విద్యార్థులకు పరీక్ష నిర్వహించిన ఘటన మరింత సంచలనంగా మారింది. ప్రాక్టికల్ పరీక్షకు ముందే ప్రశ్నపత్రం విద్యార్థులకు లీక్ అయిందన్న అనుమానాలు బలపడుతున్నాయి. అధికారిక ప్రశ్నపత్రంలో ఆ ప్రశ్నలు లేకపోవడంతో, అక్రమంగా ప్రశ్నపత్రాన్ని మార్చాల్సి వచ్చిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఇతర ఎగ్జామినర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఇది ఒక్కసారిగా జరిగిన ఘటన కాదని, గతంలోనూ ఇదే విభాగంలో మార్కుల కేటాయింపులో పక్షపాత ధోరణి కొనసాగుతోందన్న ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల పీజీ పూర్తిచేసిన ఒక విద్యార్థి, మార్కుల విషయంలో అన్యాయం జరిగిందంటూ వైస్ ఛాన్సలర్‌కు ఫిర్యాదు చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చెప్పినట్టు చేస్తేనే మార్కులు, గోల్డ్ మెడల్ వస్తాయని, లేదంటే ఫెయిల్ చేస్తామని విద్యార్థులను బెదిరించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ కారణంగా నష్టపోయిన పలువురు విద్యార్థులు అధికారులను ఆశ్రయించడం యూనివర్సిటీలో చర్చనీయాంశంగా మారింది. మంచి అకడమిక్ సంప్రదాయాలు, క్రమశిక్షణకు ప్రతీకగా పేరున్న కాకతీయ యూనివర్సిటీలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం అత్యంత దురదృష్టకరమని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి విషయాలు గతంలోనూ యూనివర్సిటీ ఉన్నతాధికారుల దృష్టికి వచ్చినప్పటికీ, ఎటువంటి కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ అక్రమాలు మరింత పెరిగాయని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికైనా యూనివర్సిటీ పాలకులు స్పందించి, ఈ మొత్తం వ్యవహారంపై నిష్పక్షపాత విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, అధ్యాపకులు డిమాండ్ చేస్తున్నారు. అకడమిక్ వ్యవస్థపై విద్యార్థుల నమ్మకం నిలబెట్టాలంటే, పరీక్షల నిర్వహణలో పూర్తి పారదర్శకత, న్యాయం, బాధ్యత తప్పనిసరి అని వారు స్పష్టం చేస్తున్నారు.















Leave a Reply