ఫెలోషిప్ స్కామ్ చేసిన వారిని కాపాడే ప్రయత్నాలు….
కమిటీ నివేదిక ప్రకారం చర్యలు తీసుకునేందుకు సిద్ధం….
నాలుగు సార్లు షోకాజ్ నోటీసులు ఇచ్చినా చలించని మంథని…
యూజీసీ నోటీసులతో స్పందించిన కేయూ అధికారులు…..
హన్మకొండ జోర్డార్ ప్రతినిధి:
కాకతీయ యూనివర్సిటీలో యూజీసీ పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ నిధుల వినియోగానికి సంబంధించిన వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఫెలోషిప్ నిబంధనల ఉల్లంఘనపై అందిన ఫిర్యాదుపై యూజీసీ స్పందించి, కాకతీయ యూనివర్సిటీ నుంచి పూర్తి వివరాలు, సంబంధిత రికార్డులు, ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక కోరడంతో ఈ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.
గతంలో యూనివర్సిటీ స్థాయిలో ఏర్పాటు చేసిన విచారణ కమిటీ ఫెలోషిప్ నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు నిర్ధారించి, సంబంధిత మొత్తాన్ని రికవరీ చేయడంతో పాటు నిబంధనల ప్రకారం క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసినట్లు సమాచారం. కమిటీ నివేదిక ఆధారంగా సంబంధిత వ్యక్తికి పలుమార్లు షోకాజ్ నోటీసులు జారీ చేసినప్పటికీ, వ్యవహారం తుది దశకు చేరకపోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ప్రత్యేకంగా, ఫెలోషిప్ కాలంలో ఇతర ఉద్యోగం చేయకూడదనే నిబంధనకు విరుద్ధంగా పనిచేసి వేతనం పొందినట్లు వచ్చిన ఆరోపణలపై యూనివర్సిటీ విచారణ జరిపిన నేపథ్యంలో, కమిటీ సిఫారసులను అమలు చేయడంలో ఎందుకు జాప్యం జరిగిందనే అంశం ఇప్పుడు ప్రధానంగా మారింది.
యూజీసీ నుంచి నోటీసులు వచ్చిన నేపథ్యంలో కేయూ అధికారులు ఈ వ్యవహారంపై మళ్లీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కమిటీ నివేదిక, షోకాజ్ నోటీసులు, సంబంధిత నియామక ఉత్తర్వులు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన రికార్డులను పరిశీలించి, నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకునే దిశగా అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
పైరవీల జోరు…
అయితే, విచారణ ప్రక్రియలో ఎవరైనా వ్యక్తిగత పైరవీలు లేదా ఒత్తిళ్లకు తావిస్తే, అది యూజీసీకి సమర్పించాల్సిన వాస్తవ నివేదికపై ప్రభావం చూపకూడదనే అభిప్రాయం యూనివర్సిటీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే విచారణ కమిటీ సిఫారసులు ఉన్న నేపథ్యంలో, వాటిని నిష్పాక్షికంగా అమలు చేసి, రికవరీ మరియు క్రమశిక్షణా చర్యలపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొంటున్నారు. గతంలో పని చేసిన వీసీ అనుయాయులైన ఇద్దరు కాంట్రాక్టు అధ్యాపకులతో కలిసి పైరవీలకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది.
నాలుగు సార్లు షోకాజ్ నోటీసులు జారీ చేసినప్పటికీ వ్యవహారం ఇంకా కొలిక్కి రాకపోవడం కూడా చర్చకు దారితీస్తోంది. ఒకే రకమైన నిబంధనల ఉల్లంఘనలకు వేర్వేరు విభాగాల్లో వేర్వేరు ప్రమాణాలు వర్తిస్తున్నాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, యూనివర్సిటీ పరిపాలన పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
ప్రజా నిధులు, యూజీసీ ఫెలోషిప్ నిధులు, ఫెలోషిప్ నిబంధనల అమలు వంటి అంశాలకు సంబంధించినందున ఈ వ్యవహారంలో ఎటువంటి పక్షపాతానికి తావులేకుండా కమిటీ నివేదిక ప్రకారం చర్యలు తీసుకుని, వాస్తవ పరిస్థితులను యూజీసీకి సమగ్రంగా నివేదించాల్సిన బాధ్యత కేయూ అధికారులపై ఉంది. యూజీసీ కోరిన నివేదికలో ఇప్పటివరకు జరిగిన విచారణ, జారీ చేసిన నోటీసులు, వచ్చిన వివరణలు, రికవరీ పరిస్థితి, క్రమశిక్షణా చర్యల వివరాలను స్పష్టంగా పొందుపరిస్తే ఈ వ్యవహారంపై ఉన్న అనేక సందేహాలకు తెరపడే అవకాశం ఉంది.
















Leave a Reply