రామాయణ శ్లోకాల నుంచి ఏఐ కోడింగ్ వరకు….
విద్యార్థి దశ నుంచే విజేతగా హంసిని ప్రస్థానం…
ఆల్ రౌండర్ గోపగోని హంసిని అరుదైన ప్రతిభ…
జోర్దార్ డెస్క్ (హైదరాబాద్):
నేటి పోటీ ప్రపంచంలో చాలామంది పిల్లలు చదువు, ర్యాంకులు, కోరికల చుట్టూనే తమ ప్రపంచాన్ని నిర్మించుకుంటారు. చదువులో నంబర్ వన్‌గా నిలుస్తూనే, ఇంట్లోని ఆర్థిక పరిస్థితులను అవగతం చేసుకుని, నైతిక బాధ్యతతో ప్రవర్తించే పిల్లలు అరుదుగా ఉంటారు. అయితే హైదరాబాద్‌కు చెందిన గోపగోని హంసిని విద్యార్థిగా తాను విజయాలు సాధిస్తూ, తోటివారికి దారిచూపిస్తూ ముందుకు సాగుతోంది. అరుదైన వ్యక్తిత్వానికి, అద్భుతమైన ప్రతిభకు అద్దం పడుతోంది. పాఠశాల స్థాయి నుంచే అలవరచుకున్న క్రమశిక్షణ, ఆలోచనా పరిణతి, నిరంతర శ్రమ, అంకితభావం, ఆర్థిక స్పృహ ఒక చిన్నారిని కెరీర్ ప్రారంభంలోనే ఎలా ఉన్నత స్థానంలో నిలబెడతాయో నిరూపించింది గోపగోని హంసిని.
ఒక వైపు భక్తి, సంస్కృతి, సంప్రదాయ విలువలు.. మరోవైపు ఆధునిక సాంకేతికత, కోడింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ).. ఈ రెంటినీ సమతుల్యం చేసుకుంటూ ఎదిగింది హంసిని. ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూనే కుటుంబం పట్ల బాధ్యతలతో అడుగులు వేస్తూ నేడు గ్లోబల్ ఐటీ దిగ్గజం హెచ్ సి ఎల్ టెక్నాలజీస్ లో “టెక్ బి” గా జాయిన్ అయింది. సమకాలీన సమాజంలో విద్యార్థులు, యువతకు ఆదర్శంగా నిలుస్తోన్న హంసిని ప్రస్థానం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం.
స్ఫూర్తినిచ్చే నాయకత్వం :
హంసిని ఇంట గెలిచి రచ్చ గెలిచిన అమ్మాయి. ఇంట్లో పెద్దమ్మాయిగా తన బాధ్యతలను చిన్నతనం నుంచే ఎంతో పరిణతితో స్వీకరించింది. చిన్నప్పటి నుంచే చదువులో ప్రతిభ కనబరుస్తూ వస్తోన్న హంసిని.. తన ఇద్దరు చెల్లెళ్లు సహస్ర, సాత్వికలకు మార్గదర్శిగా నిలుస్తోంది. అలా బోధనా నైపుణ్యాన్ని కూడా విద్యార్థి దశలోనే వంటబట్టించుకుంది. చెల్లెళ్లకు చదువులో సందేహాలు నివృత్తి చేయడం, సంక్లిష్టమైన అంశాలను సులభంగా అర్థమయ్యేలా వివరించడం ఆమెలో చిన్నతనంలోనే లీడర్‌షిప్ నైపుణ్యాలను పెంపొందించింది. తాను స్వయంగా గ్రహించిన, అనుసరిస్తోన్న పరీక్షల వ్యూహాలను చెల్లెళ్లకు కూడా పంచుతూ వారి చదువులోనూ కీలక పాత్ర పోషిస్తోంది.
విద్యలో మైలురాళ్లు :
హంసిని విద్యా ప్రయాణం అద్భుతమైన ఫలితాల సమాహారంగా చెప్పుకోవచ్చు. హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ వర్క్ జతకలిస్తే వచ్చే ఫలితాలకు హంసిని మార్కులే నిదర్శనం అవుతున్నాయి. పదో తరగతి లో 9.0 సి జి పి ఏ సాధించింది. ఇంటర్మీడియట్ లో 93.5 శాతం మార్కులతో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ మార్కులు సాధించింది. అంతేకాదు.. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో తన సత్తా చాటి, దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎస్ ఆర్ ఎమ్ యూనివర్సిటీ వంటి సంస్థల్లో తొలి ప్రయత్నంలోనే సీటు సాధించింది.

బహుముఖ ప్రజ్ఞ – అవార్డులు, రివార్డుల పంట :
హంసిని వివిధ విభాగాలలో ప్రతిభ చూపి పలు జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులు, ప్రశంసా పత్రాలు సొంతం చేసుకుంది. ఆమె సాధించిన కొన్ని అవార్డులు, రివార్డులు గమనిస్తే…
- ‘కొడింగల్’ సంస్థ నిర్వహించిన టెక్నాలజీ ఆప్టిట్యూడ్ అండ్ కోడింగ్ విభాగంలో టాప్ 10 పర్సంటైల్ సాధించి స్టెమ్ గుర్తింపు పొందిన ‘కోడింగ్ స్టార్’ సర్టిఫికేట్ పొందింది.
- ఆర్థోడాక్స్ కోడింగ్‌తో పాటు ‘ఏఐ ఫర్ టెకిస్’ ద్వారా ఏఐ- అసిస్టెడ్ కోడింగ్, పైథాన్ విజువలైజేషన్స్ నేర్చుకుని వర్క్ షాప్ సర్టిఫికేట్ సాధించింది.
- అంతరిక్ష విజ్ఞానంలో తన ఆసక్తికి నిదర్శనంగా భారత ప్రభుత్వ కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ (ఎన్సీఈఆర్టీ) నిర్వహించిన “అప్నా చంద్రయాన్” క్విజ్‌లో సర్టిఫికేట్ పొందింది.
- తొమ్మిదో తరగతిలోనే ఒలంపియాడ్ లో తనదైన ప్రతిభను చూపించింది.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా జాతీయ సాహిత్య పరిషత్ అండ్ యువ భారతి నిర్వహించిన బాల గంగాధర్ తిలక్ ఉపన్యాస పోటీలలో ప్రశంసాపత్రం అందుకుంది.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా జాతీయ సాహిత్య పరిషత్ అండ్ యువ భారతి నిర్వహించిన ఉపన్యాస పోటీలలో శ్రీమద్రామాయణంలో ‘గుహుడు’ పాత్రపై ప్రసంగించి ‘బాల వాగ్వాహిని’గా ప్రశంసాపత్రాన్ని అందుకుంది.
- యువ భారతి ఆధ్వర్యంలో భగవద్గీత సాంఖ్య యోగ శ్లోక పఠన పోటీలో పాల్గొని ప్రశంసాపత్రం పొందింది.
- ఈనాడు దినపత్రిక ఆధ్వర్యంలో నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో ద్వితీయ బహుమతి సాధించి అందరి ప్రశంసలు అందుకుంది.
- పదో తరగతి ఫలితాల్లో చూపిన అత్యుత్తమ ప్రతిభకు గాను హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ద్వారా స్కాలర్షిప్ , ప్రశంసా పత్రాన్ని అందుకుంది. అలాగే, పదో తరగతిలో – సాధించిన అత్యుత్తమ మార్కులకు గానూ కౌండిన్య ఎడ్యకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రోత్సాహక ప్రశంసాపత్రాన్ని అందుకుంది.
- దసరా, బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా ధృవాంశ్ డ్యాన్స్ అకాడమీ నిర్వహించిన నృత్యపోటీల్లో పాల్గొని అత్యంత ప్రతిభ కనబరిచింది.
- ఆర్ట్ ఆఫ్ లివింగ్ నిర్వహించిన 21-డేస్ మెడిటేషన్ ఛాలెంజ్‌లో “గోల్డ్ సర్టిఫికేట్” సాధించింది.
పరిణతి చెందిన ఆలోచన – ఆర్థిక స్పృహ, కుటుంబానికి అండ :
హంసిని ప్రత్యేకత కేవలం పుస్తకాలు, చదువులకే పరిమితం కాలేదు. అలాగే, ప్రతిభ, విజ్ఞానానికి సంబంధించిన అవార్డులు, రివార్డులతోనే సరిపెట్టుకోలేదు. ఇంట్లోని పరిస్థితులను తనకు తానే అర్థం చేసుకునేంతటి సూక్ష్మగ్రాహి ఆ చిన్నారి. ఎంత బాగా చదువుతున్నా, ప్రతి క్లాసులో ర్యాంకులు సాధిస్తున్నా ఏనాడూ తల్లిదండ్రులను ఖరీదైన కోరికలతో ఇబ్బంది పెట్టలేదు, మారాం చేయలేదు హంసిని. పిన్న వయసులోనే ఆర్థిక వివేచన ఆమె సొంతం. ప్రతి విషయంలోనూ కుటుంబానికి ఏది తక్కువ ఖర్చు అవుతుందో, ఏది ఉపయోగకరమో అటువైపే మొగ్గు చూపేది. మరోవైపు.. తల్లిదండ్రులకు ఇంటి పనుల్లో సహాయపడుతూ ఒక ఆదర్శవంతమైన కూతురిగా నిలిచింది హంసిని.
ఏఐ ఇంజనీర్ లక్ష్యం – ఎర్లీ కెరీర్ విజయం :
తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలపై పట్టు, కమ్యూనికేషన్ స్కిల్స్, మానసిక ఏకాగ్రత, కృత్రిమ మేథ రంగంలో ఎదగాలనే స్పష్టమైన ఆశయంతో తనదైన లక్ష్యాన్ని నిర్దేశించుకుంది హంసిని. నేటి వేగవంతమైన సాంకేతిక ప్రపంచంలో విద్యతో పాటు కెరీర్‌ను కూడా సమాంతరంగా ప్రారంభించాలనే సరికొత్త ఆలోచనతో ఆమె హెచ్ సి ఎల్ ఎర్లీ కెరీర్ ప్రోగ్రాం ను ఎంచుకుంది. కఠినమైన ఎంపిక ప్రక్రియ, పోటీని తట్టుకుని, తొలి ప్రయత్నంలోనే హంసిని విజేతగా నిలిచి హెచ్ సి ఎల్ టెక్ బి గా ఎంపికై, చదువుకుంటూనే ఉద్యోగం చేసే అరుదైన మైలురాయిని చేరుకుంది.
నేటి తరం యువతకు స్ఫూర్తి :
లక్ష్యం స్పష్టంగా ఉండి, దానికి క్రమశిక్షణ, నిరంతర శ్రమ, సాంకేతికతపై ఆసక్తి, కుటుంబం పట్ల బాధ్యత తోడైతే సాధించలేనిది ఏదీ లేదని గోపగోని హంసిని నిరూపించింది. సంస్కృతిని విస్మరించకుండా, ఆధునిక సాంకేతిక రంగాన్ని స్వాగతిస్తూ సొంత కాళ్లపై నిలబడుతున్న హంసిని.. నేటి తరం విద్యార్థులకు, ముఖ్యంగా స్వయం సమృద్ధిని కాంక్షించే యువతకు ఒక గొప్ప రోల్ మోడల్. గోపగోని హంసిని భవిష్యత్తులో సాంకేతిక ప్రపంచంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిద్దాం…
















Leave a Reply