సూపరింటెండెంట్‌చంద్ర మోహన్ రాజుపై మహిళా ఉద్యోగి ఫిర్యాదు…
నిష్పక్షపాత విచారణకు డిమాండ్…
వరంగల్ జోర్దార్ ప్రతినిధి (20 ఆగస్టు 2026):
కాకతీయ యూనివర్సిటీ హాస్టల్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగి, హాస్టల్ సూపరింటెండెంట్ బీ. చంద్ర మోహన్ రాజ్‌పై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేశారు. అధికారిక విధుల్లో భాగంగా తనను అవమానకరంగా, అసభ్యకరంగా మాట్లాడటంతో పాటు మానసికంగా వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు.
ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం, ఆగస్టు 17న ఉదయం సుమారు 10:47 గంటలకు కార్యాలయానికి వెళ్లి “గుడ్ మార్నింగ్ సర్” అని పలకరించిన సమయంలో సూపరింటెండెంట్ తనను అవమానకరమైన పదజాలంతో దూషించారని ఆమె పేర్కొన్నారు. గతంలోనూ తనను “బేబీ” అని పిలవడంతో పాటు, అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు తనను తీవ్ర మానసిక వేదనకు గురిచేశాయని, వాటి స్వభావం లైంగిక వేధింపులకు సంబంధించినదిగా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
*రాత్రి వేళల్లో కార్యాలయానికి రావాలని ఒత్తిడి*
ఆగస్టు 17న రాత్రి సుమారు 9:30 గంటలకు శోభన్ అనే ఉద్యోగి తన ఇంటికి వచ్చి “సర్ ఆఫీస్‌కు రమ్మంటున్నాడు” అని చెప్పినట్లు మహిళా ఉద్యోగి తెలిపారు. అయితే ఆ సమయంలో తాను కార్యాలయానికి రాలేనని స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు.
తాను గతంలో రాత్రి 7, 8, 8:30, 9 గంటల వరకు, ఒకరోజు రాత్రి 10 గంటల వరకు కూడా విధులు నిర్వర్తించినప్పటికీ, పని చేయడం లేదంటూ తనను దూషిస్తున్నారని ఆమె ఆరోపించారు. రాత్రి వేళల్లో కార్యాలయానికి రావాలని ఒత్తిడి చేయడం, విధులు నిర్వహిస్తున్నప్పటికీ అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం తనపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు.
*మానసిక వేదనకు గురవుతున్నానని ఆవేదన*
తనను పదేపదే కించపరుస్తూ దుర్భాషలు ఉపయోగిస్తున్నారని, “ఒంటరి ఆడదాని” వంటి వ్యాఖ్యలతో మానసికంగా తీవ్రంగా బాధిస్తున్నారని ఫిర్యాదులో మహిళా ఉద్యోగి పేర్కొన్నారు. ఈ పరిస్థితుల కారణంగా తాను తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నానని, ఇంటికి వెళ్లిన తర్వాత పిల్లల పట్ల కూడా తగిన శ్రద్ధ చూపలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.
*నిష్పక్షపాత విచారణకు డిమాండ్*
తనపై వచ్చిన ఆరోపణలను సమగ్రంగా పరిశీలించి, సూపరింటెండెంట్‌పై నిష్పక్షపాత విచారణ జరిపించాలని ఆమె యూనివర్సిటీ అధికారులను కోరారు. విచారణలో ఇరుపక్షాల వాదనలు నమోదు చేయడంతో పాటు, సంబంధిత రికార్డులు, సాక్షుల వాంగ్మూలాలు, పని సమయాలు, కాల్ వివరాలు, ఇతర ఆధారాలను పరిశీలించి వాస్తవాలను నిర్ధారించాలని విజ్ఞప్తి చేశారు.విచారణ పూర్తయ్యే వరకు తనపై ఎలాంటి ఒత్తిడి లేదా ప్రతీకార చర్యలు జరగకుండా పరిపాలనా రక్షణ కల్పించాలని కూడా కోరారు. ఆరోపణలు విచారణలో నిజమని తేలితే సంబంధిత అధికారిపై తగిన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కార్యాలయంలో సురక్షితమైన, గౌరవప్రదమైన వాతావరణం కల్పించాలని ఆమె కోరారు.ఈ ఫిర్యాదు ప్రతులను వైస్‌చాన్స్‌లర్ కార్యాలయ కార్యదర్శి, కాకతీయ యూనివర్సిటీ సంబంధిత మహిళా సెల్, యూనివర్సిటీ ఎన్‌జీవో సంఘం, మైనారిటీ ఉద్యోగుల సంఘానికి కూడా అందజేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
అయితే, ఫిర్యాదులో చేసిన ఆరోపణలు విచారణలో నిర్ధారణ కావాల్సి ఉంది. యూనివర్సిటీ అధికారులు నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది.
















Leave a Reply