కరీంనగర్ సివిల్ సప్లై అధికారి అక్రమాల పర్వం.. జమ్మికుంట మిల్లర్ల తో లాలూచి!
నిబంధనలకు విరుద్ధంగా సార్టెక్స్ మిషన్ లేని మిల్లర్లకు ధాన్యం కేటాయింపులు
కోట్ల రూపాయల బకాయిలు ఉన్నా బడా మిల్లర్లకు వెసులుబాటు
అధికారి వివక్షత పై హైకోర్టును ఆశ్రయించనున్న బాధిత రైస్ మిల్లర్లు
హైదరాబాద్ /కరీంనగర్: జోర్దార్ ప్రత్యేక ప్రతినిధి):
కరీంనగర్ జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి (డీసీఎస్ఓ) నరసింగరావు వ్యవహారశైలి మరియు ఆయన అవినీతి అక్రమాలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. నిబంధనలను తుంగలో తొక్కుతూ, లంచాలకు కక్కుర్తి పడి ఆయన చేస్తున్న ధాన్యం కేటాయింపులు జిల్లాలో కలకలం రేపుతున్నాయి.
సార్టెక్స్ నిబంధనలకు తూట్లు:
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యం కేటాయింపునకు ముందు’సార్టెక్స్’ మిషనరి ఉండటం తప్పనిసరి. జిల్లాలలో ఈ నిబంధనను మిగిత మిల్లర్స్ కు కఠినంగా అమలు చేసి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మిల్లర్స్ కు మాత్రం దీనికి విరుద్ధంగా జరుగుతోంది. సార్టెక్స్ మెషినరీ లేని చాలా మంది మిల్లర్ల నుండి భారీగా ముడుపులు తీసుకొని, వారికి నిబంధనలకు విరుద్ధంగా డీసీఎస్ఓ నరసింహారావు ధాన్యం కేటాయిస్తున్నట్లు స్వయంగా మిల్లర్లే బహిరంగంగా ఆరోపిస్తున్నారు.
కోట్ల బకాయిలున్నా.. బడా మిల్లర్లకు లబ్ధి:
బాయిల్డ్ రైస్ మిల్లులకు సంబంధించి కోట్ల రూపాయల టెండర్ ధాన్యం బకాయిలు చెల్లించకపోయినా, మూడు సీజన్లకు సంబంధించిన ధాన్యాన్ని రొటేషన్ సిస్టం పేరుతో పక్కదారి పట్టించినా, మిల్లులలో భౌతికంగా ధాన్యం నిల్వలు లేకున్నా సరే.. డీసీఎస్ఓ వారికి అండగా నిలుస్తున్నారని ఆరోపణలున్నాయి. కొద్దిమంది మిల్లర్ల పట్ల వివక్ష చూపుతూ, మరికొందరికి ఏ-గ్రేడ్ నుంచి బి-గ్రేడ్కు మార్పులు చేస్తూ భారీగా లబ్ది చేకూరుస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బ్యాంకు గ్యారంటీలు మరియు మిల్లుల నిల్వ సామర్థ్యాన్ని (క్యాపసిటీ) లెక్కించకుండా నిబంధనలకు విరుద్ధంగా ధాన్యం కట్టబెడుతున్నట్లు సమాచారం.
విజిలెన్స్ మరియు ఏసీబీకి ఫిర్యాదులు.. అయినా కొనసాగుతున్న లాబీయింగ్:
ఈ అవినీతి అక్రమాలపై గత రెండు సంవత్సరాలుగా సివిల్ సప్లై కమిషనర్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, యాంటీ కరప్షన్ బ్యూరో (ACB) తదితర ఉన్నతాధికారులకు అనేక ఫిర్యాదులు వెళ్లినప్పటికీ, డీసీఎస్ఓ తనకున్న పలుకుబడితో లాబీయింగ్ చేసుకుంటూ ఎటువంటి చర్యలు లేకుండా తప్పించుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లా మరియు రాష్ట్ర స్థాయి అధికారులు స్పందించకపోవడం వల్లే ఆయన అక్రమాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని బాధితులు వాపోతున్నారు.
న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్న మిల్లర్లు:
డీసీఎస్ఓ నరసింహారావు అనుసరిస్తున్న ఏకపక్ష విధానాలు, వివక్ష పూరిత కేటాయింపులతో నష్టపోతున్న జమ్మికుంట ప్రాంతానికి చెందిన కొంతమంది రైస్ మిల్లర్లు ఇక వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఈ పూర్తి అవినీతి బాగోతంపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసి, ఆయనపై న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ జరిపితే మరిన్ని విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.









Leave a Reply