*హుజూరాబాద్ లో అంగన్వాడి ఉద్యోగాల పేరుతో మాయాజాలం?*
*ఒక్కో ఉద్యోగానికి రూ.3 లక్షల డిమాండ్ చేస్తున్నారంటూ ఆరోపణలు*
*ఇంటర్వ్యూలే జరగలేదు.. ప్రభుత్వ లోగో లేని పత్రాలపై అనుమానాలు*
*బ్రోకర్ల మాటలు నమ్మొద్దు.. నయాపైసా ఎవరికీ ఇవ్వొద్దు: సీడీపీఓ సుగుణ*
(హుజురాబాద్ జోర్దార్ ప్రతినిధి)
హుజూరాబాద్ ప్రాంతంలోని అంగన్వాడి కేంద్రాలకు సంబంధించిన ఉద్యోగాల భర్తీ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. అంగన్వాడి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు మధ్యవర్తులు, బ్రోకర్లు అభ్యర్థులను సంప్రదిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెలువడుతున్నాయి. ఒక్కో ఉద్యోగానికి సుమారు రూ.3 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది.
*ఇంటర్వ్యూ జరగకుండానే ఉద్యోగాలా?*
అంగన్వాడి ఉద్యోగాల భర్తీకి సంబంధించి అధికారికంగా ఎంపిక ప్రక్రియ కొనసాగాల్సి ఉండగా, కొందరు వ్యక్తులు ఇంటర్వ్యూ లేకుండానే ఉద్యోగాలు ఇప్పిస్తామని చెబుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఇంటర్వ్యూలు నిర్వహించకుండానే నియామకాలు ఎలా జరుగుతాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అంగన్వాడి ఉద్యోగాలకు సంబంధించి ఖాళీ పోస్టులు ఎన్ని ఉన్నాయి..? దరఖాస్తులు ఎన్ని వచ్చాయి..? ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది..? అభ్యర్థుల మెరిట్‌ను ఏ విధంగా పరిగణనలోకి తీసుకుంటారు..? అనే అంశాలపై స్పష్టత అవసరమని అభ్యర్థులు కోరుతున్నారు.
ప్రభుత్వ లోగో లేని పత్రాలపై అనుమానాలు*
అంగన్వాడి ఉద్యోగాలకు సంబంధించినవిగా కొందరు చూపిస్తున్న పత్రాలపై తెలంగాణ ప్రభుత్వ అధికారిక లోగో లేకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది. ఆయా పత్రాలను ఎవరు జారీ చేశారు..? వాటికి అధికారిక గుర్తింపు ఉందా..? సంబంధిత మహిళా శిశు సంక్షేమ శాఖకు వాటితో ఏమైనా సంబంధం ఉందా..? అనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
*బోగస్ సంఘాల పేరుతో వ్యవహారం?*
కొన్ని సంఘాలు, సంస్థల పేర్లను ఉపయోగించి అంగన్వాడి ఉద్యోగాలు ఇప్పిస్తామని అభ్యర్థులను నమ్మిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఆయా సంఘాలకు ఉద్యోగాల భర్తీలో అధికారికంగా ఎలాంటి పాత్ర ఉంది..? ప్రభుత్వ అనుమతి ఉందా..? లేక ఉద్యోగాల పేరుతో అభ్యర్థులను మోసం చేసేందుకు సంఘాల పేర్లను ఉపయోగిస్తున్నారా..? అనే అంశాలపై విచారణ జరగాల్సి ఉంది.
*బ్రోకర్ల మాటలు నమ్మొద్దు*
ఈ ఆరోపణలపై హుజూరాబాద్ సీడీపీఓ సుగుణ స్పష్టతనిచ్చారు. అంగన్వాడి ఉద్యోగాల భర్తీ విషయంలో అభ్యర్థులు ఎవరూ బ్రోకర్ల మాటలు నమ్మి మోసపోవద్దని ఆమె సూచించారు. ఇప్పటివరకు ఇంటర్వ్యూలు జరగలేదని, ఉద్యోగాల కోసం ఎవరూ నయాపైసా కూడా ఎవరికీ ఇవ్వవద్దని స్పష్టం చేశారు.
*మెరిట్ ప్రకారమే ఉద్యోగాలు*
ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత ఉన్న అభ్యర్థులకు మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు కల్పిస్తామని సీడీపీఓ సుగుణ తెలిపారు. ఎవరూ గాబరా పడాల్సిన అవసరం లేదని, మెరిట్ ఉన్న ప్రతి అభ్యర్థికి న్యాయం చేస్తామని స్పష్టం చేశారు.
అంగన్వాడి ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన ప్రతి అభ్యర్థి మార్కులను కూడా డిస్ప్లే చేస్తామని ఆమె తెలిపారు. దీంతో ఎంపిక ప్రక్రియలో పారదర్శకత పాటిస్తామని అధికారులు చెబుతున్నారు.
*అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలి*
అధికారుల పేర్లు, సంఘాల పేర్లు చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా డబ్బులు అడిగితే అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఉద్యోగ నియామకానికి సంబంధించి అధికారిక ప్రకటనలు, సంబంధిత శాఖ నుంచి వెలువడే సమాచారం మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
*విచారణతో తేలాల్సిన అంశాలు*
ఒక్కో అంగన్వాడి ఉద్యోగానికి రూ.3 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు నిజమా..? ఎవరు ఈ వసూళ్లకు పాల్పడుతున్నారు..? బోగస్ సంఘాల పేర్లు ఉపయోగిస్తున్నారా..? ప్రభుత్వ లోగో లేని పత్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి..? అనే అంశాలపై సమగ్రంగా విచారణ జరిపితే అసలు విషయం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.












Leave a Reply