సోషల్ టీచర్ వెంకటేశ్వర్లు ఉద్యోగ విరమణ సన్మాన సభ

అక్షర తపస్వి వెంకటేశ్వర్లు కు ఆత్మీయ నీరాజనం 

సాంఘిక శాస్త్రంలో నాలుగు దశాబ్దాల బోధన

ఘనంగా నిర్వహించిన ఉద్యోగ విరమణ ఆత్మీయ అభినందన సభ

వెంకటేశ్వర్లు మేధాశక్తి, ఉత్తమ బోధనను కొనియాడిన వక్తలు

జమ్మికుంట జోర్దార్ విలేఖరి

కరీంనగర్ జిల్లా జమ్మికుంట బాలికల ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బి వెంకటేశ్వర్లు బుధవారం రోజున పదవి విరమణ చెందారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం సతీష్ అధ్యక్షతన స్థానిక వేడుకల మందిరంలో ఉద్యోగ విరమణ ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు.ఈ సన్మానోత్సవ సమావేశంలో బంధుమిత్రులు, పూర్వ విద్యార్థులు, క్లాస్ మేట్స్, స్నేహితులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఇట్టి ఉద్యోగ విరమణ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు.. సుదీర్ఘకాలం ఉపాధ్యాయ వృత్తిలో వెంకటేశ్వర్లు అందించిన సేవలను కొనియాడారు. వేలాది పుస్తకాలని ఔపోసన పట్టిన వెంకటేశ్వర్లు నిత్యం ఏదో ఒకటి పఠిస్తూ ఉపాధ్యాయ వర్గాల్లో ‘ప్రొఫెసర్’ గా గుర్తింపు పొందారని వక్తలు పేర్కొన్నారు. వివిధ పాఠశాలల్లో ఆయన అత్యంత అంకిత భావంతో పనిచేసి విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచి ఎందరో విద్యార్థుల్ని ఉన్నతులుగా తీర్చిదిద్దారని కొనియాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వైద్యుల రాజిరెడ్డి మాట్లాడుతూ… ప్రభుత్వ విద్యా వ్యవస్థ కఠినమైన సవాళ్లను ఎదుర్కొంటున్న ప్రస్తుత సందర్భంలో ఉపాధ్యాయ ఉద్యోగ జీవితాన్ని ముగించిన మిత్రుడు వెంకటేశ్వర్లు ధన్యజీవి అని కొనియాడారు. ఆయన మేధాశక్తి అపారమని, రిటైర్మెంట్ తో విద్యార్థులు ఒక ఉత్తమ ఉపాధ్యాయుడిని కోల్పోతున్నారని పేర్కొన్నారు. డిటిఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు రఘుశంకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయుడిగా అత్యంత నిబద్ధతతో విధులు నిర్వహించిన వెంకటేశ్వర్లు ఉద్యోగ విరమణ అనంతరం ప్రభుత్వ విద్య బలోపేతానికి జరుగుతున్న కృషిలో భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు. విద్యా పరిరక్షణ ఉద్యమంలో మేధావుల పాత్ర కీలకమని అందులో మమేకమై వారు పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఓనం పండుగ, బోనాలు, దేశభక్తి పూరిత గీతాలకు పాఠశాల విద్యార్థులు నృత్యాన్ని అభినయించారు.
విదేశంలో ఉద్యోగం చేస్తున్న అల్లుడు, సభాముఖంగా వెంకటేశ్వర్లు తనకు తండ్రి లాంటి వాడు అని కొనియాడడం అందరిని ఆకట్టుకుంది.
సన్మాన గ్రహీత వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. తన వృత్తి జీవితంలో అనేక పాఠశాలల్లో పనిచేసిన అనుభవాల్ని గుర్తు చేసుకున్నారు. అయితే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం ప్రభుత్వ బాధ్యతని తెలిపారు. తన ఉద్యోగ జీవితంలో సహాయపడిన సంఘ బాధ్యులు ,ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఎంఈఓ హేమలత, డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆవాల నరహరి, జిహెచ్ఎంలు పద్మ, జరీన , బాదం సురేష్ బాబు, వీణవంక కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం చంద్రమౌళి , మడిపల్లి హెచ్ఎం భాగ్యమ్మ తో పాటు ఉపాధ్యాయులు భాగ్యలక్ష్మి , వీరాచారి, రమాదేవి , శ్రీలత, రమాకుమారి, వి ప్రకాష్ , అరుణ, కరుణా, టి శ్రీనివాస్ మరియు బాల్య మిత్రులు హమ్ 9 ఏక్ బృంద సభ్యులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *