విలేకరిపై ఆగ్రహించిన ఎమ్మెల్యే

సభలో విలేకరిపై ఎమ్మెల్యే ఆగ్రహం!

ప్రజాప్రతినిధి తరఫున సమస్య ప్రస్తావించడంపై అభ్యంతరం

మొగుళ్లపల్లి మండలంలో చర్చనీయాంశంగా మారిన ఘటన

భూపాలపల్లి జోర్దార్ ప్రతినిధి.

మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన జనరల్ బాడీ సర్వసభ్య సమావేశంలో విలేకరి నిమ్మల భద్రయ్యపై ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన మండలంలో చర్చనీయాంశంగా మారింది.

మండల సర్వసభ్య సమావేశం ఎంపీడీవో సురేందర్ గౌడ్ అధ్యక్షతన సాయంత్రం మూడు గంటలకు ప్రారంభమైంది. సమావేశానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్యఅతిథిగా హాజరై వివిధ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, అభివృద్ధి అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ క్రమంలో ఎల్లారెడ్డిపల్లె గ్రామానికి చెందిన నిమ్మల భద్రయ్య విలేకరి హోదాలో సమావేశానికి హాజరయ్యారు. గ్రామ సర్పంచ్‌కు సంబంధించిన అంశాలను సభలో ప్రస్తావించే క్రమంలో ఆయన గ్రామ సమస్యను ప్రస్తావించినట్లు సమాచారం. దీనిపై ఎమ్మెల్యే అభ్యంతరం వ్యక్తం చేస్తూ, గ్రామానికి సంబంధించి ప్రజాప్రతినిధులు ఉన్నందున వారి ద్వారా సమస్యలను సభ దృష్టికి తీసుకురావాలని సూచించినట్లు తెలిసింది.

విలేకరి తన పాత్రికేయ బాధ్యతలకే పరిమితమై వ్యవహరించాలని ఎమ్మెల్యే సూచించడంతో సభలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్లు సమాచారం. ఈ ఘటన అనంతరం నిమ్మల భద్రయ్య వ్యవహారశైలిపై మండలంలో చర్చ మొదలైంది.

భద్రయ్య రేషన్ డీలర్ల సంఘం మండల అధ్యక్షుడిగా, గ్రామ వార్డు సభ్యుడిగా, పలు సంఘాల్లో బాధ్యతలు నిర్వహించడంతో పాటు విలేకరిగా కూడా కొనసాగుతున్నారని స్థానికంగా చర్చ జరుగుతోంది. ఒకే సమయంలో పలు బాధ్యతలు నిర్వహిస్తూ మండల సమావేశాల్లో ఏ హోదాలో వ్యవహరిస్తున్నారన్న అంశం కూడా చర్చకు వస్తోంది.

అయితే గ్రామ సమస్యలను ప్రస్తావించేందుకు ప్రజాప్రతినిధులతో పాటు ప్రజా సమస్యలపై పనిచేసే ఇతరులు కూడా తమ అభిప్రాయాలను వెల్లడించే అవకాశం ఉండాలని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, అధికారిక సర్వసభ్య సమావేశాల్లో ఎవరు ఏ హోదాలో మాట్లాడాలి, ఏ అంశాలను ఎవరు ప్రస్తావించాలనే విషయంలో స్పష్టమైన విధానం ఉండాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఘటనపై ఎమ్మెల్యే ఆగ్రహం, విలేకరి సభలో వ్యవహరించిన తీరు ప్రస్తుతం మొగుళ్లపల్లి మండలంలో హాట్‌టాపిక్‌గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *