వైద్యుల నిర్లక్ష్యం యువకుడి మృతి

*కరీంనగర్ జిల్లా కేంద్ర ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమే 25 ఏళ్ల భాస్కర్ ప్రాణం బలిగొందా?*

_విచారణ జరిపి న్యాయం చేయాలని ముఖ్యమంత్రికి మృతుని తల్లి పద్మ ఫిర్యాదు

(కరీంనగర్ జోర్దార్ ప్రతినిధి)

ఎలాంటి దీర్ఘకాలిక రోగం లేని 25 ఏళ్ల యువకుడు కేవలం కడుపులో మంటతో కరీంనగర్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి, మరుసటి రోజు ఉదయమే ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డ్యూటీలో ఉన్న జూనియర్ వైద్యులు సరైన పరీక్షలు చేయక, రోగాన్ని అంచనా వేయలేక నిర్లక్ష్యంగా వ్యవహరించడమే మృతికి కారణమని మృతుని తల్లి పద్మ ఆరోపిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసింది.

*ఘటన వివరాలు*
బాధితురాలు పద్మ కథనం ప్రకారం.. ఆగస్టు 28వ తేదీ ఉదయం ఆమె కుమారుడు *ఏం. భాస్కర్ (25 సం.)* కడుపులో మంటతో కరీంనగర్ జిల్లా కేంద్ర ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులో చేరాడు. అయితే అక్కడ ఉన్న వైద్యులు కనీస పరీక్షలు కూడా సరిగా నిర్వహించలేదని, రోగ నిర్ధారణ చేయకుండా నిర్లక్ష్యంగా వదిలేశారని తల్లి వాపోయింది.

*ప్రాణం పోయే వరకు పట్టించుకోలేదు – తల్లి ఆవేదన*
“సకాలంలో సరైన పరీక్షలు చేసి, పరిస్థితి విషమంగా ఉందని గుర్తించి పై ఆసుపత్రికి రిఫర్ చేసి ఉంటే నా కొడుకు బతికేవాడు” అని తల్లి పద్మ కన్నీటి పర్యంతమవుతోంది. మరుసటి రోజు ఉదయానికే భాస్కర్ ప్రాణాలు విడవడం వైద్యుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆమె ఆరోపిస్తోంది.

*1. ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలి.*
*2. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన జూనియర్ వైద్యులు, సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలి.*
*3. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి, ప్రభుత్వ పరంగా ఆదుకోవాలి.*

కడుపు మంటతో వచ్చిన యువకుడికి కనీస వైద్యం అందించలేని పరిస్థితి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించి న్యాయం చేయాలని తల్లి పద్మ కోరుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *