నష్టపోతున్న సోయా రైతులు

ఆదిలాబాద్ జిల్లాలో సోయా రైతుల కష్టాలు

ఆదిలాబాద్, సెప్టెంబర్ 27, జోర్దార్ ప్రతినిధి

ఆదిలాబాద్ జిల్లాలో సోయాబీన్ రైతులు ఆందోళనలో ఉన్నారు. ఈ ఏడాది జిల్లాలో 63,000 ఎకరాలకు పైగా సోయా సాగు చేశారు. అయితే సకాలంలో వర్షాలు కురవకపోవడంతో సోయా పంట ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదు. దీంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితులతో చీడపీడలు పెరగడంతో పురుగుల మందుల కోసం రైతులు అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చింది. జిల్లాలో మరో 20 రోజుల్లో పంట కోతకు రాబోతోంది. పంట కోతకు ఎకరాకి ₹4,000 నుంచి ₹5,000 వరకు హార్వెస్టింగ్ ఖర్చవుతోందని రైతులు అంటున్నారు.అయితే ఈ సంవత్సరం ఎకరాకి 5 క్వింటాళ్లకు మించి దిగుబడి వచ్చే పరిస్థితి లేదని , పెట్టుబడి సైతం చేతికి అందుతుందో లేదోనని రైతులు గుబులు చెందుతున్నారు. గత ఏడాది అధిక వర్షాలు, ఈ ఏడాది వర్షాలు లేని పరిస్థితుల కారణంగా వరుసగా నష్టపోయామని సోయా రైతులు వాపోతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో గత సంవత్సరం సోయా పంట కాత దశలో అత్యధికంగా వర్షాలు కురవడం కారణంగా రైతులు నష్టపోయారు. దిగుబడి గణనీయంగా తగ్గిపోయి పెట్టుబడి చేతికి అందని పరిస్థితి నెలకొంది. అయితే రైతులు నిరాశ చెందక ఈ సంవత్సరం అయినా కలిసి వస్తుందని ఆశతో సుమారు 63 వేల ఎకరాలలో సోయా విత్తనం సాగు చేశారు.ఈ నేపథ్యంలోనే ఎల్ నినో కారణంగా వర్షాభావ పరిస్థితులను సైతం తట్టుకొని పంట నిలదొక్కుకున్నప్పటికీ ప్రస్తుతం పంట కాయ దశలో నీరు అందక గడ్డు పరిస్థితి నెలకొంది. సరిగ్గా సోయా గింజ కాసే దశలో వర్షాలు లేకపోవడంతో పంటకు నీరు అందక దిగుబడి తగ్గిపోయే దుస్థితి నెలకొంది. సమయానుకూలంగా చేనుకు నీరు అందితేనే పంట చేతికి వస్తుంది. సమయం దాటిపోతే పైరు పచ్చగా ఉన్నప్పటికీ కాయలో గింజలు మాత్రం రావు.
దీంతో ఈ సంవత్సరం దిగుబడిపై గణనీయంగా తగ్గిపోయిందని సోయా సాగు చేసే రైతులు వాపోతున్నారు. వర్షాలు లేని కారణంగా ఎకరాకి 10 క్వింటాళ్లు రావాల్సిన సోయా పంట దిగుబడి 5 క్వింటాళ్లకు కూడా మించని పరిస్థితి ఉంది. సగం పంట నష్టం నేపథ్యంలో రైతులకు పెట్టుబడి సైతం గిట్టుబాటు అయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. దానికి తోడు ఈ సంవత్సరం చీడపీడల కారణంగా పురుగుమందులు అధికంగా వినియోగించాల్సి రావడంతో సాగువ్యయం పెరిగింది. పంట దిగుబడి సైతం తగ్గింది. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. వరుసగా రెండో సంవత్సరం సైతం పంట నష్టం కారణంగా ప్రభుత్వం తమను ఆదుకోవాలని సోయా రైతులు కోరుతున్నారు. పంట దిగుబడి తగ్గిపోతున్న దృష్ట్యా సోయా పంటకు మద్దతు ధరను పెంచి ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *