ప్రశ్నార్థకంగా మారిన చండ్రుగొండ తాసిల్దార్ విచారణ నివేదిక

*విచారణ చేశారా? వివరాలు దాచి పెట్టారా* ?

*డొంకతిరుగుడుగా చండ్రుగొండ తాసిల్దార్ విచారణ నివేదిక*

*సర్వే నంబర్ల తారుమారు మర్మమేమిటి*?

*ఎవరిని రక్షించడం కోసం తప్పుడు నివేదిక*?

హైదరాబాద్/ ఖమ్మం జోర్దార్ నిఘా విభాగం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ తాసిల్దార్ నిందితుల్ని రక్షించాలనే లక్ష్యంతో తూతూ మంత్రం , గందరగోళ విచారణ నివేదిక రూపొందించి జిల్లా కలెక్టర్ నే బురిడీ కొట్టించాలని ప్రయత్నించి దొరికిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ సూటిగా అడిగిన ప్రశ్నకు డొంక తిరుగుడు సమాధానంతో తాసిల్దార్ జగదీశ్వర ప్రసాద్ విచారణ రిపోర్టు రూపొందించి సమర్పించారు.
వివరాల్లోకి వెళితే…..

*రాకేష్ చౌదరి కారుణ్య నియామకం*

ఖమ్మం జిల్లా చండ్రుగొండ మండలం మద్దుకూరు గ్రామానికి చెందిన నల్లమోతు నాగేశ్వరరావు (తండ్రి. వెంకటరత్నం) అసిస్టెంట్ పారామెడికల్ ఆఫీసర్ (ఏపిఎంఓ) గా చండ్రుగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ఉద్యోగం చేస్తూ మే2014 లో అనారోగ్యంతో చనిపోయారు. మరణించిన ఉద్యోగి భార్య వాణి తమకు ఎలాంటి జీవనాధారం లేదని, కుటుంబ పోషణ భారంగా ఉందని ప్రార్థిస్తూ తన కుమారుడికి కారుణ్య నియామకం పై ఉద్యోగం ఇప్పించాల్సిందిగా కోరుతూ మే 2015లో ఖమ్మం డిఎం అండ్ హెచ్ ఓ కు దరఖాస్తు చేశారు.
ఆ క్రమంలో మరణించిన ఉద్యోగి కుమారుడు నల్లమోతు రాకేష్ చౌదరి కు ఆగస్టు 2016లో వైద్య ఆరోగ్యశాఖలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పట్వారి గూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు కారుణ్య నియామకం క్రింద జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగి గా నియామకం జరిగింది.ఆయన ప్రస్తుతం సీనియర్ అసిస్టెంట్ గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నర్సింగ్ కాలేజీలో విధులు నిర్వహిస్తున్నారు.

*తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఉద్యోగం*

కారుణ్య నియామకం కోసం నల్లమోతు రాకేష్ చౌదరి తప్పుడు దృవీకరణ పత్రాలు సమర్పించారు. తన కుటుంబ సభ్యుల పేరిట విలువైన ఆస్తులు , ఆదాయాన్నిచ్చే భూములు ఉన్నప్పటికీ స్థానిక రెవెన్యూ కార్యాలయాన్ని మేనేజ్ చేసి నో ప్రాపర్టీ, నో ఎర్నింగ్ సర్టిఫికెట్లు సంపాదించి ఉద్యోగం కోసం సమర్పించారు. రాకేష్ చౌదరి కుటుంబానికి ఆదాయాన్నిచ్చే విలువైన భూములు ఉన్నప్పటికీ చండ్రుగొండ తాసిల్దార్ కార్యాలయం కళ్ళు మూసుకుని నో ప్రాపర్టీ ,నో ఎర్నింగ్ సర్టిఫికెట్లు జారీ చేశారు. నల్లమోతు రాకేష్ చౌదరి కుటుంబానికి ఎలాంటి స్థిర, చర ఆస్తులు లేవని పైగా పెన్షన్ ఇన్కమ్ సైతం సున్నాగా సూచిస్తూ చండ్రుగొండ తాసిల్దార్ రాఘవాచార్య, డిసెంబర్ 2015లో నో ప్రాపర్టీ సర్టిఫికెట్ జారీ చేశారు.

*తప్పుడు సర్టిఫికెట్లపై “జోర్దార్” కథనాలు*

సమాచార హక్కు చట్టం కార్యకర్త కేసగాని శంకర్ అందించిన సమాచారం ఆధారంగా, రాకేష్ చౌదరి కారుణ్య నియామకం కోసం సమర్పించిన తప్పుడు ఫేక్ సర్టిఫికెట్ వ్యవహారంపై జూలై 25 వ తేదీన “అర్హతలు లేకున్నా కారుణ్య ఉద్యోగం” మరియు జూలై 28వ తేదీన “ప్రశ్నార్థకంగా మారిన కారుణ్య నియామకం” శీర్షికలతో జోర్దార్ దినపత్రిక రెండు వార్తలు సాక్ష్యాధారాలతో సహా ప్రచురించింది.

*జోర్దార్ వార్తకు స్పందించిన జిల్లా కలెక్టర్

విచారణకు ఆదేశం 

ఖమ్మం జిల్లా చంద్రుగొండ తాసిల్దార్ రాఘవాచార్య జారీచేసిన తప్పుడు సర్టిఫికెట్ వ్యవహారంపై జోర్దార్ ప్రచురించిన కథనంపై విచారణ చేసి ఐదు రోజుల్లో నివేదిక సమర్పించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఇ2/2344/2026 తేదీ 01/08/2026 ద్వారా చంద్రుగొండ తాసిల్దారును ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

*తప్పును కప్పిపుచ్చే తప్పుడు విచారణ నివేదిక*

జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించడంతో దోషులు రంగంలోకి దిగి నష్ట నివారణ చర్యలు ప్రారంభించారు. తప్పుడు సర్టిఫికెట్ జారీ చేసిన అప్పటి తాసిల్దార్ రాఘవాచార్య మరియు అక్రమ కారుణ్య నియామకం పొందిన నిందితుడు రాకేష్ చౌదరి లను రక్షించే ప్రయత్నంలో భాగంగా ప్రస్తుతం చండ్రుగొండ తాసిల్దార్ గా పనిచేస్తున్న జగదీశ్వర ప్రసాద్ “అశ్వద్ధామ హతోహతః..” అన్న రీతిలో ఆకుకు అందని పోకకు పొందని విచారణ నివేదికను రూపొందించారు. జోర్దార్ కథనం ఆధారంగా కలెక్టర్ సూటిగా అడిగిన ప్రశ్నకు జవాబు ఇవ్వకుండా చండ్రుగొండ తాసిల్దార్ డొంక తిరుగుడు జవాబుతో విచారణ నివేదికను నింపివేశారు.తన నివేదికతో జిల్లా కలెక్టర్ ను సైతం బురిడీ కొట్టించే ప్రయత్నంలో తాసిల్దార్ అడ్డంగా దొరికిపోయారు.

*విచారణ నివేదికపై సవాలక్ష సందేహాలు*

రాకేష్ చౌదరి ఉద్యోగ నియామకం (ఆగస్టు 2016)నాటికి ఆయన కుటుంబానికి ఆదాయాన్ని ఇచ్చే ఆస్తులు ఉన్నాయా? లేవా? ఆయన దివంగత తండ్రి లేదా తల్లి పేరిట భూములు ఉన్నాయా?
రాకేష్ తండ్రి నల్లమోతు నాగేశ్వరరావుకు మద్దుకూరు రెవెన్యూ పరిధిలో 2010 నుండి 2017 వరకు19.32 ఎకరాల భూమి ఉంది. మరి డిసెంబర్ 2015 లో రాకేష్ కుటుంబానికి ఆస్తులు లేవని నో ప్రాపర్టీ సర్టిఫికెట్ ఎలా జారీ చేశారు?
ఈ అంశంపై చండ్రుగొండ తాసిల్దార్ జగదీశ్వర ప్రసాద్ విచారణ చేసి సూటిగా జవాబు ఇవ్వకుండా తన నివేదికలో రాకేష్ తాత ముత్తాతల ఆస్తులను ఏకరువు పెట్టారు. ఈ క్రమంలో వారి భూముల సర్వే నెంబర్లను సైతం మార్చివేశారు.తాత ముత్తాతల నుండి వారసత్వంగా ఆస్తులు సంక్రమిస్తే సర్వే నంబర్లు సైతం మారుతాయా? రాకేష్ చౌదరి వాంగ్మూలము, మద్దుకూరు గ్రామ పాలనాధికారి మరియు చండ్రుగొండ మండలం 2వ గిరిదావర్ నివేదికల ఆధారంగా తాసిల్దారు సమర్పించిన విచారణ నివేదికలో పేర్కొన్న వారసత్వంగా సంక్రమించిన భూమి సర్వే నంబర్ల మార్పుకు కారణాలు ఏమిటి?
నల్లమోతు సుబ్బయ్య కుమారుడైన వెంకటరత్నం ముగ్గురు కుమారులలో ఒకరైన నాగేశ్వరరావు తండ్రి పేరును పట్టాదారు కాలమ్ లో సుబ్బయ్య గా పేర్కొనడం వెనుక మతలబు ఏమిటి? ఇది తప్పు దోవ పట్టిన విచారణ కాదా?


అంతేకాకుండా రాకేష్ చౌదరి పేరిట 15.34 ఎకరాలు, దివంగత తండ్రి పేరిట 19.32 ఎకరాలు, తల్లి వాణి పేరిట 6.24 ఎకరాలు భూమి ఉన్నట్లు ధృవీకరించారు. అంటే రాకేష్ చౌదరికి గతంలో తాసిల్దార్ రాఘవాచార్య జారీచేసిన నో ప్రాపర్టీ, నో ఎర్నింగ్ సర్టిఫికెట్ తప్పని తేల్చారా?
వీటన్నిటిని పరిశీలిస్తే చండ్రుగొండ తాసిల్దార్ జగదీశ్వర ప్రసాద్
ఆర్. సి. నెంబర్ బి/435/2026 తేదీ:16.9.2026 ద్వారా జిల్లా కలెక్టర్ కు సమర్పించిన విచారణ నివేదిక పలు సందేహాలకు తావిస్తోంది. తాసిల్దార్ విచారణ నివేదిక జిల్లా కలెక్టర్ ని బురిడీ కొట్టించి, గత తాసిల్దార్ రాఘవాచార్య మరియు నిందితుడు రాకేష్ చౌదరి లను రక్షించే ప్రయత్నంగా కనబడుతోంది. ఇప్పటికైనా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ సీరియస్ గా స్పందించి చండ్రుగొండ రెవెన్యూ కార్యాలయం రికార్డులను జప్తు చేసి విచారిస్తే అవినీతికి పాల్పడిన రెవెన్యూ అధికారుల గుట్టు రట్టు అవుతుంది. ఆ దిశగా నిజాయితీకి మారుపేరుగా నిలిచిన జిల్లా కలెక్టర్ చర్యలు ఉంటాయా? వేచి చూడాలి మరి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *