Advertisement

పిఆర్సి నివేదిక స్వీకరించి వెంటనే అమలు చేయాలి

*పిఆర్సి నివేదిక స్వీకరించి వెంటనే అమలు చేయాలి*

*డిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి*

హనుమకొండ జోర్దార్ ప్రతినిధి

   ఉపాధ్యాయ, ఉద్యోగుల జేఏసీ తలపెట్టిన ఉద్యమం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఇచ్చిన లిఖిత పూర్వక హామీ మేరకు వెంటనే పిఆర్సి కమిషన్ నుండి రిపోర్ట్ తెప్పించుకొని అమలుకు  చర్యలు చేపట్టాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. లింగారెడ్డిలు డిమాండ్ చేశారు.
     డి టి ఎఫ్ హనుమకొండ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు గాదరి ఉప్పలయ్య అధ్యక్షతన డిటిఎఫ్ జిల్లా కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కట్కూరి శ్రీనివాస్ కార్యకలాపాల నివేదికను ప్రవేశపెట్టారు.  
       ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన  టి.లింగారెడ్డి మాట్లాడుతూ.. పి ఆర్ సి గడువు ముగిసి మూడు సంవత్సరాలు కావస్తున్నందున,ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పిఆర్సి నివేదిక తెప్పించుకొని 01.07.2023 నుండి అమలయ్యే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న 6 డి ఎ లు వెంటనే విడుదల చేయాలని, ఉద్యోగుల ఆరోగ్య పథకానికి సంబంధించి ఇప్పటికైనా సమగ్రమైన రీతిలో విధివిధానాలు రూపొందించి, సంబంధిత ఆసుపత్రులతో స్పష్టంగా చర్చించి ఆరోగ్య పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలన్నారు.
   సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని,2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వ మెమో ప్రకారము పాత పెన్షన్ అమలు విషయమై గతంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2003 డి ఎస్ సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేసిన విధంగా తెలంగాణలో కూడా అమలు చేయాలన్నారు. పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల, పెన్షనర్ల ఆర్థిక బిల్లులు వెంటనే చెల్లించాలని కోరారు.
     రాష్ట్ర కార్యదర్శి అటుకుల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తికి సంబంధించి అశాస్త్రీయంగా ఉన్న జీవో 25 ను సవరించాలని, ప్రాథమిక స్థాయిలో తరగతికి ఒక గది, ఒక ఉపాధ్యాయుడు ఉండే విధంగా చూడాలన్నారు. పాఠశాలలు ప్రారంభమై మూడు నెలలు కావస్తున్నా ఇప్పటికీ విద్యార్థులందరికీ సరిపడ ఏకరూప దుస్తులు,బూట్లు,బ్యాగులు ఇతర వస్తువులు సరఫరా చేయలేదన్నారు. రోజురోజుకు పాఠశాలల్లో బోధనేతర పనులు ఎక్కువ అవుతున్నందున ఉపాధ్యాయుడు తరగతి గదికి దూరం చేయబడుతున్నాడన్నారు. ప్రైవేటు పాఠశాలలకు లేని ఈ బోధనేతర పనులు ప్రభుత్వ పాఠశాలలకు పెట్టడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై దృష్టి పెట్టి ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలన్నారు.
      ఈ సమావేశంలో అధ్యాపక జ్వాల  ప్రధాన సంపాదకులు డాక్టర్ ఎం.గంగాధర్, జిల్లా అధ్యక్షులు గాదరి  ఉప్పలయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కట్కూరి శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు జె. గోవర్ధన్, అల్లం మల్లయ్య, ఎస్.సుమ, ఎం.హర్షవర్ధన్ రెడ్డి, పి.చిన్నెశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *