అట్టహాసంగా రెడ్ క్రాస్ ఎన్నికలు

*రెడ్‌క్రాస్ ఎన్నికల్లో ‘ఎమ్మెల్సీ’ తరహా ప్రచారం!*

*కరీంనగర్‌లో హోరాహోరీగా పోస్టర్లు, సోషల్ మీడియా ప్రచారం*

*తొలి మేనేజింగ్ కమిటీ ఎన్నికల తీరుపై సభ్యుల అభ్యంతరాలు*

*నిబంధనలు పాటిస్తున్నారా..? జిల్లా కలెక్టర్‌ జోక్యం చేసుకోవాలంటూ డిమాండ్*

(కరీంనగర్ జోర్దార్ నిఘా బృందం)

సేవా సంస్థగా ప్రజల్లో విశ్వసనీయత పొందిన రెడ్‌క్రాస్ ఎన్నికల్లో రాజకీయ తరహా ప్రచారం చోటుచేసుకుంటోందన్న ఆరోపణలు కరీంనగర్ జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. ఈ నెల 4న ఎస్‌ఆర్‌ఆర్ కళాశాలలో జరగనున్న కరీంనగర్ జిల్లా ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ మేనేజింగ్ కమిటీ ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాలో ప్రచార పోస్టర్లు విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి. అభ్యర్థుల క్రమ సంఖ్యలను ప్రస్తావిస్తూ, మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరుతూ సభ్యుల గ్రూపుల్లో సందేశాలు పంపుతున్న తీరుపై పలువురు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

దాదాపు 18 వేల మంది ఓటర్లు ఉన్నారని పేర్కొంటూ, ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్న తీరు సాధారణ రాజకీయ ఎన్నికలను తలపిస్తోందని సభ్యులు అంటున్నారు. సేవా సంస్థ ఎన్నికల్లో ఇలాంటి ప్రచార ఆర్భాటం అవసరమా? అంటూ ప్రశ్నిస్తున్నారు.

*తొలి ఎన్నికలపైనే అనేక సందేహాలు*

జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ తొలి మేనేజింగ్ కమిటీ ఎన్నికల నిర్వహణ విధానంపైనా పలువురు సభ్యులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ చట్టం, 1920లోని నిబంధనలు, రాష్ట్ర, జిల్లా శాఖలకు వర్తించే మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల ప్రక్రియ కొనసాగాల్సి ఉంటుందని వారు పేర్కొంటున్నారు.

జాతీయ ప్రధాన కార్యాలయం నుంచి గతంలో జారీ చేసిన ఎన్నికల మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల నోటీసు, ఓటర్ల ముసాయిదా జాబితా, అభ్యంతరాల స్వీకరణ, తటస్థ రిటర్నింగ్ అధికారి నియామకం వంటి అంశాలకు ప్రాధాన్యం ఉంటుందని సభ్యులు గుర్తుచేస్తున్నారు.

*పోస్టర్లు.. ప్రాధాన్యత ఓట్లు.. వాట్సాప్ ప్రచారం!*

ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల పేర్లు, క్రమ సంఖ్యలు, మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతున్నట్లు సభ్యులు చెబుతున్నారు. అయితే ఇటువంటి ప్రచారానికి సంస్థ నిబంధనల్లో అనుమతి ఉందా? లేదా? అన్నది స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని వారు కోరుతున్నారు.

“సేవా సంస్థ ఎన్నికల్లో సేవా కార్యక్రమాలే ప్రాధాన్యమా? లేక ప్రచార ఆర్భాటమా?” అనే చర్చ ప్రస్తుతం సభ్యుల్లో జరుగుతోంది.

*సేవా సంస్థకు రాజకీయ రంగు వద్దు*

రెడ్‌క్రాస్ సంస్థ మానవత్వం, నిష్పాక్షికత, తటస్థత, స్వచ్ఛంద సేవ వంటి మౌలిక విలువలకు ప్రాధాన్యం ఇస్తుందని సభ్యులు గుర్తుచేస్తున్నారు. ఎన్నికల్లో అధిక ప్రచారం, ఆర్థికంగా బలమైనవారు లేదా పలుకుబడి ఉన్నవారికి ప్రయోజనం కలిగించే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చే వారికి వారి సేవా కార్యక్రమాలే గుర్తింపుగా ఉండాలని, ఎన్నికల ప్రచార ఆర్భాటం కాకూడదని వారు అభిప్రాయపడుతున్నారు.

*కలెక్టర్‌ జోక్యం చేసుకోవాలని డిమాండ్*

కరీంనగర్ జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీకి సంబంధించిన ఎన్నికల ప్రక్రియపై జిల్లా స్థాయిలో స్పష్టత ఇవ్వాలని సభ్యులు కోరుతున్నారు. ఎన్నికల నిబంధనలు, ఓటర్ల జాబితా, రిటర్నింగ్ అధికారి నియామకం, తొలి మేనేజింగ్ కమిటీ ఏర్పాటుకు అనుసరించిన విధానం తదితర అంశాలపై సమగ్రంగా పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ హోదాలో ఉన్న జిల్లా కలెక్టర్‌ తక్షణమే స్పందించి, సోషల్ మీడియాలో జరుగుతున్న ఎన్నికల తరహా ప్రచారంపై నిబంధనల ప్రకారం పరిశీలన జరిపించాలని సభ్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *