కమిషన్ల కక్కుర్తి… ఎరువుల డీలర్లకు తప్పని తిప్పలు!
మాకొండూరు సహకార సంఘంలో 37 లక్షల చెల్లింపులపై వివాదం
పీఐసీ కమిటీ తీరుపై భగ్గుమంటున్న రైతులు, డీలర్లు
కరీంనగర్ జోర్ధార్ ప్రతినిధి
మాకొండూరు విశాల సహకార పరపతి సంఘంలో పీఐసీ కమిటీ వ్యవహారశైలి రోజుకో వివాదాస్పదంగా మారింది. సంఘం పరువును బజారుకీడ్చేలా కమిషన్ల కక్కుర్తితో కొందరు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఎరువులు సరఫరా చేసిన ఏజెన్సీకి చెల్లించాల్సిన రూ. 37 లక్షల బిల్లుల విషయంలో కమిషన్ల కోసం డీలర్లను సంఘ కార్యాలయం చుట్టూ తిప్పుతున్న వైనంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వివరాల్లోకి వెళితే గత మూడు నెలల క్రితం మాకొండూరు సహకార సంఘానికి వివిధ రకాల ఎరువులను పలు ఏజెన్సీలు డీలర్లు సరఫరా చేశారు. సంఘం ద్వారా ఆ ఎరువులన్నీ రైతులకు పూర్తిగా విక్రయించబడ్డాయి. ఆ అమ్మకాల ద్వారా వచ్చిన సుమారు రూ. 37 లక్షల నగదు ప్రస్తుతం సంఘం బ్యాంకు ఖాతాలో నిల్వ ఉంది. ఆ నిధులను ఎరువులు సరఫరా చేసిన సంబంధిత ఏజెన్సీకి చెల్లించాల్సి ఉండగా, పీఐసీ కమిటీకి చెందిన పర్సన్ ఇన్చార్జ్ గత మూడు నెలలుగా చెక్కుపై సంతకం చేసి ఇవ్వకుండా తీవ్ర జాప్యం చేస్తున్నారు.
కమిషన్ల డిమాండే కారణమా?
సహకార సంఘానికి సకాలంలో సరుకు అందించి, రైతులకు అండగా నిలిచిన డీలర్లకు డబ్బులు చెల్లించడంలో ఈ నిర్లక్ష్యం వెనుక ‘కమిషన్ల దందాయే’ కారణమని బాధితుడు ఆరోపిస్తున్నారు. చెక్కుపై సంతకం చేసి ఇవ్వడానికి కొంత శాతం పర్సంటేజ్ ముట్టజెప్పాలంటూ సదరు ఏజెన్సీ ప్రతినిధులను గత మూడు నెలలుగా ఆఫీసు చుట్టూ తిప్పుతున్నట్లు తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ప్రజాధనంతో, రైతుల సేవలో పారదర్శకంగా పనిచేయాల్సిన పదవుల్లో ఉండి, ఇలాంటి అవినీతి చర్యలకు పాల్పడటం పట్ల సంఘ సభ్యులు, రైతులు మండిపడుతున్నారు.
భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు
సహకార సంఘాల పట్ల నమ్మకంతో వ్యాపారం చేసే ఏజెన్సీలను ఈ విధంగా ఇబ్బంది పెడితే, రాబోయే రోజుల్లో ఏ ఒక్క డీలర్ లేదా కంపెనీ కూడా సంఘానికి సరుకు సరఫరా చేయడానికి ముందుకు రాదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంఘం పేరును, పరువును బజారుకీడ్చుతున్న బాధ్యుల తీరుపై జిల్లా సహకార అధికారి తక్షణమే స్పందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
వెంటనే ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఈ రూ. 37 లక్షల లావాదేవీలపై సమగ్ర విచారణ జరపాలని, ఏజెన్సీకి ఇవాల్సిన బకాయిలను తక్షణమే ఇప్పించి, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు మరియు సంఘ సభ్యులు కోరుతున్నారు.









Leave a Reply