ఇరవై ఏళ్లుగా బడి ముఖం చూడని ఉపాద్యాయుడు.
అసిస్టెంట్ నుండి అధికారి దాక …అన్నీ తానే
ప్రస్తుతం ఓపెన్ స్కూల్, ఉల్లాస్ గా ద్విపాత్రాభినయం
(వరంగల్ జోర్దార్ ప్రతినిధి)
బతకలేని బడిపంతులు అనేది ఒకనాటి మాట. బెల్లు(బడిగంట) బిల్లు(జీతం) వరకే ఉపాధ్యాయులు పరిమితం అన్నది నిన్నటిమాట. ఈ రెండిటికి భిన్నంగా ఏకంగా గత ఇరవైయేళ్ళుగా చాక్ పీస్ పట్టని, బడిగంట వినని , బిల్లు మాత్రం టంచన్ గా పొందుతున్న ఓ ఉపాధ్యాయుని బాగోతం వరంగల్ జిల్లాలో బయట పడింది. విద్యాహక్కు చట్టానికి విరుద్దంగా జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయాల్లో అలవాటు పడిన ఉపాధ్యాయులు కొంత మంది బడి మొఖం చూడడానికి ఇష్టపడడం లేదనడానికి ఇదో ఉదాహరణ.
ఉమ్మడి వరంగల్ జిల్లా లో సమగ్రశిక్ష కార్యాలయంలో గత ఇరవైఏళ్ళకితం బందు ప్రీతితో సెక్టోరియల్ అధికారులకు అసిస్టెంట్ గా అవతారం ఎత్తిన ఓ సెకండరీ గ్రేడ్ ఉపాద్యాయుడు ప్రస్తుతం పదోన్నతి పొంది కూడా వివిధ అవతారాల్లో జిల్లా కార్యాలయాన్ని పట్టుకొని వేలాడుతున్నాడు. డిఇఓ కార్యాలయాన్ని వదిలి వెళ్లలేక పోతున్నాడు. జిల్లా అధికారులను మచ్చిక చేసుకొని, సెక్టోరియల్ అధికారులకు అసిస్టెంట్ గా కొన్ని సంవత్సరాలు, ఆతరువాత వరంగల్ జిల్లాలో అసిస్టెంట్ డీసీసీబీ సెక్రటరీగా అవతారం ఎత్తి మరికొంతకాలం సదరు ఉపాద్యాయుడు కొనసాగాడు. ఆ తరువాత బదిలీ పైన వెళ్లడంతో అతి తక్కువ కాలం మహబూబాబాద్ జిల్లాలో పనిచేసి, స్పౌజ్ బదిలీల్లో భాగంగా జిల్లా కేంద్రానికి సమీపాన పాఠశాలలో తిష్టవేసాడు. కొంతకాలానికే పదోన్నతులు రావడంతో అది వొదులుకోలేక రాయపర్తి మండలం లోని పాఠశాలకు స్కూల్ అసిస్టెంట్ గా వెళ్లడం జరిగింది. స్వతహాగా జిల్లాకేంద్రానికి దూరం వెళ్లలేని సదరు ఉపాద్యాయుడు ఏకంగా జిల్లాలో ఉల్లాస్ కోఆర్డినేటర్ గా మరోసారి జిల్లా కార్యాలయంలో ఎంట్రీ వేశారు. అక్కడ పూర్తి సమయం ఉంటున్నట్టు అధికారులను మెప్పించి తన స్వంత పనులు చేసుకున్నారు. నిజానికి ఉల్లాస్ కోఆర్డినేటర్ గా జిల్లాలోని సెకండరీ గ్రేడ్ టీచర్లను నియమించాల్సి ఉన్నా అందుకు విరుద్దంగా తాను చేరడం జరిగింది. ఇంతలో జిల్లా కార్యాలయంలో అసిస్టెంట్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ పోస్ట్ ఖాళీ కావడంతో దాని పైన కూడా ఇతని కన్ను పడింది. ఇంకేముంది? ఏకంగా సెకండరీ గ్రేడ్ టీచర్లకే చెందాల్సిన అసిస్టెంట్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ పోస్టుకు ఆర్డరు దక్కించుకున్నాడు. చివరకు ఇది నిబంధనలకు విరుద్ధమని ట్రెజరీ అధికారులు స్పష్టం చేయడంతో తిరిగి ఉల్లాస్ కోఆర్డినేటర్ గా సెటిల్ అయ్యాడు. ప్రస్తుతం జిల్లా కార్యాలయంలో డి ఎస్ ఓ పోస్ట్ ఖాళీ కావడంతో దానికి కూడా ప్రయత్నించి భంగపడ్డారు. ఇప్పుడు జిల్లాలో ఏకంగా అకడమిక్ మానిటరింగ్ అధికారి పోస్ట్ కావాలని అధికారులకు పేచీలు పెడుతున్నాడు. జిల్లాలో ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ కూడా తానేనని ప్రకటించి పాఠశాలకు వెళ్లకుండా, కార్యాలయం లోనే తిష్ట వేసాడు. జిల్లాలో ని ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉన్నప్పటికి అతనిని అక్కడే కొనసాగిస్తూ విద్యార్థులకు నష్టం చేస్తున్నారు. మొత్తంగా గత 20 ఏళ్లుగా పాఠశాల ఆవరణలో అడుగు పెట్టకుండా, విద్యాహక్కు చట్టానికి సొంత భాష్యం చెప్పారు. జీతం పొందుతున్న పాఠశాలలో ఒకటే పోస్ట్ ఉన్నప్పటికి పాఠశాలకు హాజరవకుండా కార్యాలయంలో నే తిష్టవేయడం అతనికే చెల్లింది. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ పలుమార్లు మందలించి ఉపాధ్యాయుడిని పాఠశాలకు పంపినా ఎదో ఒక సాకుతో కార్యాలయంలోనే తిష్ట వేసి ఉంటున్నారు. పాఠశాలకు వెళ్లకుండా జీతం పొందుతున్న ఈ ఉపాధ్యాయుడి ఉదంతం పైన విద్యార్థి సంఘాలు, సామాజిక సంఘాలు పై అధికారులకు పిర్యాదు చేయడం తో పాటు విద్యాశాఖ ఉన్నతాధికారులు విచారించి తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.









Leave a Reply