పెద్దపల్లిలోఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికలో వివాదం
లంచాలు తీసుకుని అవార్డులు ఇచ్చారని తీవ్ర ఆరోపణలు*
*వాట్సాప్ గ్రూపులు, స్టేటస్ లలో చక్కర్లు కొడుతున్న అక్రమాల చిట్టా*
*స్పందించని జిల్లా విద్యాశాఖజిల్లా విద్యాశాఖ*
జోర్దార్ నిఘా విభాగం
పెద్దపల్లి జిల్లాలో ఇటీవల సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఇచ్చిన జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ఎంపిక వివాదాస్పదంగా మారింది. ఉత్తమ ఉపాధ్యాయులు అనే పేరుతో అనర్హులకు అవార్డులు ఇచ్చి అంకితభావంతో పనిచేస్తున్న ఉపాధ్యాయులను విస్మరించారని పలువురు విమర్శిస్తున్నారు.
అవార్డుల ఎంపికలో ఉపాధ్యాయ సంఘ నాయకుల అనుచిత జోక్యం ఎక్కువగా ఉందని, సంఘ నాయకులు వారి భార్యలకు, స్నేహితులకు అవార్డులు ఇప్పించుకున్నారని విమర్శలు ఉపాధ్యాయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. జిల్లాలోని వివిధ మండలాల ఎంఈఓ లు సైతం తమ హోదాలను మరిచి సంఘ నాయకులు చెప్పుచేతల్లో ఉంటూ డబ్బులకు అవార్డులను అమ్ముకున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. దీనివల్ల అంకితభావంతో కష్టపడి పని చేసే ఉపాధ్యాయులకు అన్యాయం జరిగిందని పలువురు ఉపాధ్యాయుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక “నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు” అన్నట్టుగా సాగిందని పలువురు ఉపాధ్యాయులు బహిరంగంగా చర్చిస్తున్నారు.ఉపాధ్యాయుల ఎంపికలో మనోడు, మన కులపోడు, మన స్నేహితుడు, దగ్గరోడు, మంచిగా అరసు కునేటోళ్లు అనేవి అర్హతలుగా మారాయా? అని విమర్శిస్తున్నారు. పాఠశాలకు వెళితే సరిపోతుందా? క్లాసులకు వెళ్లకున్నా, చదువు చెప్పకున్నా ఉత్తమ ఉపాధ్యాయులవుతారా? పాఠశాలను రణరంగంగా మార్చిన వారికి సైతం అవార్డులు ఇస్తారా?
పర్యవేక్షణ సిబ్బంది పాఠశాల సందర్శనకు వెళ్లినప్పుడు రుచికరమైన, కోరిన భోజనం వడ్డించడమే ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికలో ప్రధాన అర్హతగా మారిందా?
ఉత్తమ బోధనతో పాఠశాలలో మంచి ఫలితాలు సాధిస్తున్న ఉపాధ్యాయులను అవార్డుల ఎంపికలో ఎలా విస్మరిస్తారని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.
ఎలిగేడు మండలంలోని కొందరు ఉపాధ్యాయులు అవార్డుల ఎంపికలో జరిగిన అన్యాయంపై తమ వాట్సాప్ స్టేటస్ లలో ఎంపిక అధికారులను ప్రశ్నిస్తూ స్టేటస్ లు పెడుతుండడం గమనార్హం. అయినా తేలు కుట్టిన దొంగల్లా అధికారులు ఏమాత్రం స్పందించడం లేదు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ఎంపికలో జరిగిన అక్రమాలపై ఉన్నతాధికారులు విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. భవిష్యత్తులో అనర్హులకు అవార్డులు దక్కకుండా అధికారులు జాగ్రత్త వహించాలని, అంకితభావంతో పాఠశాలలో పనిచేస్తూ విద్యార్థులకు ఉత్తమ సేవలందించే ఉపాధ్యాయులను మాత్రమే అవార్డులకు ఎంపిక చేయాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.













Leave a Reply