కేయూ పార్ట్‌టైం నియామకాల్లో గందరగోళం!

కేయూ లో పార్ట్ టైం ఎంపికలో అవకతవకలు

కేయూ పార్ట్‌టైం నియామకాల్లో గందరగోళం!

నోటిఫికేషన్‌లో లేని ఈ.డెబ్యూ.ఎస్ రోస్టర్‌కు ఇంటర్వ్యూ ఎలా నిర్వహించారు?

ఎస్టీ కేటగిరీలో రెండు ఖాళీలకు ఒక్కరే ఎంపిక.. మరో పోస్టు ఎందుకు భర్తీ చేయలేదు?

అధికారుల మౌనం వెనుక మర్మమేమిటి?

వరంగల్, సెప్టెంబర్ 28 (జోర్దార్ ప్రతినిధి): కాకతీయ విశ్వవిద్యాలయంలోని భౌతిక శాస్త్ర విభాగంలో పార్ట్‌టైం అధ్యాపకుల నియామక ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది. నోటిఫికేషన్‌లో పేర్కొనని ఈ.డెబ్యూ.ఎస్ కేటగిరీకి చెందిన అభ్యర్థిని ఇంటర్వ్యూకు పిలవడం, అదే క్రమంలో ఎస్టీ కేటగిరీలో రెండు ఖాళీలు ఉండగా ఒక్క పోస్టునే భర్తీ చేయడం వంటి పరిణామాలు అనేక ప్రశ్నలకు తావిస్తున్నాయి. నియామక ప్రక్రియలో పారదర్శకత, రోస్టర్ అమలు, మెరిట్ ప్రాతిపదికన ఎంపిక వంటి అంశాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై జోర్డార్ వరుస కథనాలకు శ్రీకారం చుట్టింది.

నోటిఫికేషన్‌లో ఎనిమిది పోస్టులు.. రోస్టర్‌లో లేని ఈ.డబ్ల్యూ.ఎస్ ఎక్కడి నుంచి వచ్చింది?…

భౌతిక శాస్త్ర విభాగంలో ఎనిమిది పార్ట్‌టైం అధ్యాపక పోస్టుల భర్తీకి 2026 ఫిబ్రవరి 18న నోటిఫికేషన్ విడుదలైంది. కేయూ వైస్‌ ఛాన్సలర్ ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డి ఆమోదంతో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్రం ఈ నోటిఫికేషన్‌ను జారీ చేశారు. బ్యాక్‌లాగ్, క్యారీ ఫార్వర్డ్ రోస్టర్ పాయింట్లను అందులో పొందుపరిచి, అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 28లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నోటిఫికేషన్‌లోని బీసీ – సీ, ఎస్సీ.జీ.II రోస్టర్ పాయింట్లకు దరఖాస్తులు రాలేదు. ఎస్టీ కేటగిరీలో రెండు పోస్టులకు ముగ్గురు అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే, నోటిఫికేషన్‌లో పేర్కొనని ఈ.డబ్ల్యూ.ఎస్ కేటగిరీ నుంచి ఒక దరఖాస్తు రావడం, ఆ అభ్యర్థిని ఎంపిక ప్రక్రియలోకి తీసుకోవడం ఇప్పుడు ప్రధాన వివాదంగా మారింది.

అసలు నోటిఫికేషన్‌లో లేని కేటగిరీకి చెందిన దరఖాస్తును ఎవరు స్వీకరించారు? దరఖాస్తుల పరిశీలనలో ఆ అభ్యర్థిని ఎవరు అర్హుడిగా గుర్తించారు? నోటిఫికేషన్‌లో ఈ.డబ్ల్యూ.ఎస్ రోస్టర్ పాయింట్ లేకపోయినా ఇంటర్వ్యూకు ఎలా పిలిచారు? ఈ ప్రశ్నలకు నియామక ప్రక్రియను నిర్వహించిన అధికారులు స్పష్టమైన సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది.

28వ రోస్టర్ పాయింట్‌కు ఆమోదం ఎవరిచ్చారు?..

నోటిఫికేషన్‌లో పేర్కొనని ఈ.డబ్ల్యూ.ఎస్ అభ్యర్థిని ఇంటర్వ్యూకు పిలవడమే కాకుండా, 28-ఈ. డబ్ల్యూ.ఎస్ రోస్టర్ పాయింట్‌ను ప్రస్తావిస్తూ ఎంపిక ప్రక్రియ నిర్వహించినట్లు సమాచారం. దీనిపై విశ్వవిద్యాలయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నోటిఫికేషన్‌లో ప్రకటించిన రోస్టర్ పాయింట్లకు అనుగుణంగా ఎంపిక ప్రక్రియ సాగాల్సి ఉండగా, అదనంగా ఈ.డబ్ల్యూ.ఎస్ రోస్టర్ పాయింట్‌ను ఏ ప్రాతిపదికన చేర్చారు? దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు ఉన్నాయా? ఉంటే వాటిని ఎందుకు వెల్లడించడం లేదు? లేకుండా చేర్చినట్లయితే దానికి బాధ్యత వహించేది ఎవరు?

సెలెక్షన్ కమిటీని నియమించడం, ఇంటర్వ్యూలను నిర్వహించడం, వీడియో చిత్రీకరణ చేయడం వంటి ప్రక్రియలు పూర్తయినట్లు తెలుస్తోంది. అయితే, నోటిఫికేషన్‌లో లేని కేటగిరీ అభ్యర్థిని ఇంటర్వ్యూ చేయడానికి సెలెక్షన్ కమిటీకి ఏ నిబంధన ఆధారంగా అధికారం కల్పించారన్నది కీలక ప్రశ్నగా మారింది. నోటిఫికేషన్‌లోని రోస్టర్ పాయింట్లకు అనుగుణంగా అభ్యర్థుల ఎంపిక వివరాలను మినిట్స్‌లో నమోదు చేయాల్సి ఉండగా, 28-ఈ.డబ్ల్యూ.ఎస్ పాయింట్‌ను చేర్చిన విధానం, దానికి సంబంధించిన ఆమోదాలు, ఎంపిక కమిటీ నిర్ణయాలను బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది. కేవలం ఇంటర్వ్యూ నిర్వహించారన్న కారణంతో నోటిఫికేషన్‌లో లేని పోస్టు లేదా కేటగిరీకి నియామకం చేపట్టవచ్చా? అన్నది అధికారులే స్పష్టం చేయాలి.

ఒక్క దరఖాస్తు.. ఒక్క ఇంటర్వ్యూ.. అనేక సందేహాలు!

ఈ.డెబ్యూ.ఎస్ కేటగిరీకి నోటిఫికేషన్‌లో అవకాశం కల్పించకపోవడంతో ఆ కేటగిరీకి చెందిన ఇతర అర్హులైన అభ్యర్థులకు దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోయిందా? ఒకవేళ ఈ.డెబ్యూ.ఎస్ రోస్టర్ పాయింట్‌ను ముందుగానే ప్రకటించి ఉంటే మరిన్ని దరఖాస్తులు వచ్చేవా? ఈ అంశాలపై సమగ్ర వివరణ అవసరం. నోటిఫికేషన్‌లో లేని కేటగిరీ నుంచి ఒక్క దరఖాస్తు మాత్రమే రావడం, ఆ అభ్యర్థిని ఇంటర్వ్యూకు పిలవడం, ఎంపిక ప్రక్రియలో భాగం చేయడం వంటి పరిణామాలు సహజంగానే సందేహాలను రేకెత్తిస్తున్నాయి. అయితే, ఈ వ్యవహారంలో ఎవరైనా అక్రమంగా లబ్ధి పొందారా? ఎవరైనా నిబంధనలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారా? అన్నది సంబంధిత రికార్డులు, అధికారిక వివరణల ఆధారంగా తేలాల్సి ఉంది.

ఎస్టీ కేటగిరీలో రెండు ఖాళీలు.. ఎంపిక ఒక్కరేనా?..

ఈ నియామక ప్రక్రియలో మరో కీలక అంశం ఎస్టీ కేటగిరీకి సంబంధించినది. నోటిఫికేషన్‌లో రెండు పోస్టులు ఉండగా ముగ్గురు అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ముగ్గురూ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. అయినప్పటికీ ఒక్క అభ్యర్థినే ఎంపిక చేసి, మరో పోస్టును భర్తీ చేయకపోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

రెండు ఖాళీలకు ముగ్గురు అభ్యర్థులు పోటీపడినప్పుడు, అర్హతలు, మెరిట్, రోస్టర్ నిబంధనల ఆధారంగా ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాల్సి ఉంటుంది. స్క్రూటినీ మార్కుల కేటాయింపులో ఏవైనా పొరపాట్లు లేదా దిద్దుబాట్లు చోటుచేసుకున్నట్లయితే, వాటిని నిబంధనల ప్రకారం సరిచేసి, అభ్యర్థుల మెరిట్‌ను నిష్పాక్షికంగా నిర్ధారించారా? అన్నది స్పష్టం కావాలి. మరో పోస్టును భర్తీ చేయకపోవడానికి కారణమేంటి? అర్హులైన అభ్యర్థులు లేరా? ఎంపిక కమిటీ ఏదైనా నిర్దిష్ట కారణంతో పోస్టును ఖాళీగా ఉంచిందా? లేక స్క్రూటినీ, మార్కుల కేటాయింపులో తలెత్తిన సమస్యలే దీనికి కారణమా? ఈ వివరాలు వెల్లడించకుండా ఉండటం అభ్యర్థుల్లోనూ, విశ్వవిద్యాలయ వర్గాల్లోనూ సందేహాలను పెంచుతోంది.

వీడియో చిత్రీకరణ ఉన్నా.. పారదర్శకతపై ప్రశ్నలే!

ఇంటర్వ్యూలను వీడియో చిత్రీకరించినట్లు తెలుస్తున్న నేపథ్యంలో, ఎంపిక ప్రక్రియకు సంబంధించిన రికార్డులను పరిశీలించడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. వీడియో చిత్రీకరణ ఉండటం ఒక్కటే పారదర్శకతకు నిదర్శనం కాదు. నోటిఫికేషన్, రోస్టర్ రిజిస్టర్, దరఖాస్తుల స్క్రూటినీ, మార్కుల కేటాయింపు, సెలెక్షన్ కమిటీ మినిట్స్, ఎంపికకు సంబంధించిన ఆమోదాలు అన్నీ పరస్పరం సరిపోలినప్పుడే ప్రక్రియపై స్పష్టత ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ.డెబ్యూ.ఎస్ అభ్యర్థి దరఖాస్తును స్వీకరించిన దశ నుంచి ఇంటర్వ్యూ, ఎంపిక వరకు తీసుకున్న నిర్ణయాలన్నింటినీ రికార్డుల ఆధారంగా వెల్లడించాలి. అలాగే ఎస్టీ కేటగిరీలో రెండో పోస్టును భర్తీ చేయకపోవడానికి గల కారణాలను కూడా అధికారికంగా తెలియజేయాలి.

బాధ్యులెవరు? సమాధానం చెప్పాల్సింది ఎవరు?..

కాకతీయ విశ్వవిద్యాలయం వంటి ఉన్నత విద్యాసంస్థలో నియామక ప్రక్రియలు నిబంధనలకు అనుగుణంగా, పారదర్శకంగా జరగాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. నోటిఫికేషన్‌లో ప్రకటించిన రోస్టర్‌కు భిన్నంగా ఎంపిక ప్రక్రియ సాగినట్లయితే, దానికి సంబంధించిన అధికారిక అనుమతులు, నిబంధనలు, నిర్ణయాలను ప్రజల ముందుంచాలి. ఈ వ్యవహారంలో వైస్‌ఛాన్సలర్ ఆమోదంతో నోటిఫికేషన్ విడుదలైనందున, తదనంతర నియామక ప్రక్రియలో చోటుచేసుకున్న పరిణామాలపై విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. రిజిస్ట్రార్ కార్యాలయం, సంబంధిత విభాగం, సెలెక్షన్ కమిటీ తమ పరిధిలో తీసుకున్న నిర్ణయాలను వివరించాలి.

నోటిఫికేషన్‌లో లేని ఈ.డెబ్యూ.ఎస్ రోస్టర్ పాయింట్‌కు ఆధారం ఏమిటి? ఆ అభ్యర్థిని ఇంటర్వ్యూకు పిలవడానికి అనుమతి ఎవరిచ్చారు? ఎస్టీ కేటగిరీలో రెండో పోస్టును ఎందుకు భర్తీ చేయలేదు? స్క్రూటినీ మార్కుల కేటాయింపులో మార్పులు జరిగాయా? జరిగితే వాటికి సంబంధించిన రికార్డులు ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెలుగులోకి వస్తేనే పార్ట్‌టైం నియామకాలపై నెలకొన్న సందిగ్ధత తొలగుతుంది. లేకపోతే, కేయూ నియామక ప్రక్రియల పారదర్శకతపై సందేహాలు మరింత పెరిగే అవకాశం ఉంది.

నోటిఫికేషన్ ఒకటి.. రోస్టర్ మరొకటి.. ఎంపిక ప్రక్రియ ఇంకొకటా?..

కేయూ భౌతిక శాస్త్ర విభాగం పార్ట్‌టైం నియామకాలపై తలెత్తిన ఈ ప్రశ్నలకు విశ్వవిద్యాలయ అధికారులు సమాధానం చెప్పాలి. రోస్టర్ నిబంధనలు, ఎంపిక ప్రక్రియ, ఖాళీల భర్తీపై పూర్తి వివరాలను వెల్లడించాలి. నియామక రికార్డులను పరిశీలించి, నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించారా లేదా అన్నది స్పష్టం చేయాలి.

పార్ట్‌టైం నియామకాలపై జోర్డార్ వరుస కథనాలు కొనసాగుతాయి!…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *