కేయూ పార్ట్‌టైం నియామకాల్లో రోస్టర్ రగడ!

  • రోస్టర్ పట్టికలో 28-ఈ.డెబ్యూ.ఎస్ ఏది?
  • రిజిస్ట్రార్ ఉత్తర్వులో ఆ పాయింట్ ఎలా వచ్చింది?
  • అధికారిక పత్రాల్లోనే కనిపిస్తున్న వ్యత్యాసం.. సమాధానం చెప్పాల్సిన యూనివర్సిటీ అధికారులు!

సెప్టెంబర్ 29, జోర్డార్ వరంగల్ ప్రతినిధి:

కాకతీయ విశ్వవిద్యాలయం భౌతిక శాస్త్ర విభాగంలో పార్ట్‌టైం అధ్యాపకుల నియామకాల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. నోటిఫికేషన్‌కు సంబంధించిన రోస్టర్ పట్టికలో కనిపించని 28-ఈ.డెబ్యూ.ఎస్ పాయింట్‌పై, రిజిస్ట్రార్ కార్యాలయం జారీ చేసిన ఉత్తర్వులో ఒక అధ్యాపకుడి నియామకాన్ని పేర్కొనడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై గతంలో తలెత్తిన సందేహాలకు తాజాగా వెలుగులోకి వచ్చిన అధికారిక పత్రాలు (నోటిఫికేషన్, నియామక ఉత్తర్వులు) మరింత ప్రాధాన్యతను తెచ్చాయి.

రోస్టర్ పట్టికలో 28-ఈ.డెబ్యూ.ఎస్ ఎక్కడ?

భౌతిక శాస్త్ర విభాగంలో ఎనిమిది పార్ట్‌టైం అధ్యాపక పోస్టుల భర్తీకి 2026 ఫిబ్రవరి 18న నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన రోస్టర్ పట్టికలో బ్యాక్‌లాగ్, క్యారీ ఫార్వర్డ్ పాయింట్లతో పాటు రన్నింగ్ రోస్టర్ పాయింట్‌ను పేర్కొన్నారు. పట్టికలో 04-బీ.సీ.-ఏ, 08-ఎస్టీ, 14-బీ.సీ.-సీ, 22-ఎస్సీ-జీ-త్రీ, 24-బీ.సీ.-బీ, 25-ఎస్టీ పాయింట్లు ఉండగా, రన్నింగ్ రోస్టర్ పాయింట్ 27-ఎస్సీ-జీ-టూ గా చూపించారు. అయితే, అందుబాటులో ఉన్న ఈ పట్టికలో 28-ఈ.డబ్ల్యూ.ఎస్. పాయింట్ కనిపించడం లేదు. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించిన రోస్టర్ పట్టికలో లేని 28-ఈ.డెబ్యూ.ఎస్ పాయింట్‌పై నియామక ప్రక్రియను ఏ ప్రాతిపదికన చేపట్టారు? ఆ పాయింట్‌ను చేర్చడానికి ప్రత్యేక అనుమతి ఏదైనా ఉందా? ఉంటే ఆ ఉత్తర్వులు ఎప్పుడు జారీ అయ్యాయి?

No EWS roaster

రిజిస్ట్రార్ ఉత్తర్వులో 28-ఈ.డెబ్యూ.ఎస్ ప్రస్తావన!

2026 సెప్టెంబర్ 19 తేదీతో ఉన్న రిజిస్ట్రార్ కార్యాలయ పత్రంలో భౌతిక శాస్త్ర విభాగానికి సంబంధించి ఐదుగురు పార్ట్‌టైం అధ్యాపకుల పేర్లు, వారి రోస్టర్ పాయింట్లను పేర్కొన్నారు. అందులో శ్రీ పి. రాజేందర్ రెడ్డిని 28-ఈ.డెబ్యూ.ఎస్ రోస్టర్ పాయింట్‌కు వ్యతిరేకంగా చూపించారు. అంటే, ఒకవైపు అందుబాటులో ఉన్న రోస్టర్ పట్టికలో 28-ఈ.డెబ్యూ.ఎస్ పాయింట్ కనిపించకపోగా, మరోవైపు అధికారిక ఉత్తర్వులో అదే పాయింట్‌పై అధ్యాపకుడి పేరును నమోదు చేశారు. ఈ రెండు పత్రాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని విశ్వవిద్యాలయ అధికారులు వివరించాల్సిన అవసరం ఉంది. రోస్టర్ పాయింట్‌ను మార్చారా? కొత్తగా చేర్చారా? లేక నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి రోస్టర్ వివరాలు మార్చారా? తెకువాల్సి ఉంది. రిజిస్ట్రార్ ఉత్తర్వులో 2026-27 విద్యా సంవత్సరానికి పార్ట్‌టైం బోధనా నియామకాల కొనసాగింపును ప్రస్తావిస్తూ, రాష్ట్ర ప్రభుత్వ సమ్మతికి లోబడి ఉండాలనే షరతును పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో, నియామకాలకు సంబంధించిన ప్రతిపాదనలు, ఎంపిక కమిటీ సిఫార్సులు, వైస్‌ఛాన్సలర్ ఆమోదం, రాష్ట్ర ప్రభుత్వ సమ్మతికి సంబంధించిన పత్రాలు ఏమిటన్నది స్పష్టం కావాలి. ముఖ్యంగా 28-ఈ.డెబ్యూ.ఎస్ పాయింట్‌కు సంబంధించి ఏదైనా ప్రత్యేక ఆమోదం ఉంటే దానిని వెల్లడించాలి.

ఎస్టీ పోస్టుల్లో ఒక్కటే భర్తీ ఎందుకు?..

నోటిఫికేషన్‌లో ఎస్టీ కేటగిరీకి రెండు పోస్టులు ఉండగా, ముగ్గురు అభ్యర్థులు దరఖాస్తు చేసుకుని ఇంటర్వ్యూకు హాజరైనట్లు సమాచారం. అయినప్పటికీ ఒక్క పోస్టునే భర్తీ చేసి, మరో పోస్టును ఖాళీగా ఉంచినట్లు వచ్చిన వివరాలపై కూడా స్పష్టత అవసరం.

No ST appointment. EWS appointment without roaster in notification

రెండో పోస్టును భర్తీ చేయకపోవడానికి గల కారణం ఏమిటి? అభ్యర్థుల అర్హతలు, మెరిట్, స్క్రూటినీ మార్కుల ఆధారంగా తీసుకున్న నిర్ణయాలు ఏమిటి? ఈ వివరాలను ఎంపిక కమిటీ మినిట్స్‌తో సహా వెల్లడించాలి. ఈ వ్యవహారంలో వ్యక్తులపై ఆరోపణలు చేయడం కంటే, అధికారిక రికార్డుల ఆధారంగా నియామక ప్రక్రియను స్పష్టం చేయడం ముఖ్యం. రోస్టర్ పట్టిక, నోటిఫికేషన్, ఎంపిక కమిటీ మినిట్స్, రిజిస్ట్రార్ ఉత్తర్వు, అవసరమైన ప్రభుత్వ సమ్మతి పత్రాలను సమగ్రంగా పరిశీలిస్తేనే ఈ వ్యత్యాసానికి కారణం తెలుస్తుంది.

కేయూ అధికారులు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు ఇవే:

1. నోటిఫికేషన్‌కు సంబంధించిన రోస్టర్ పట్టికలో 28-EWS పాయింట్ ఎందుకు కనిపించడం లేదు?
2. శ్రీ పి. రాజేందర్ రెడ్డిని 28-ఈ.డెబ్యూ.ఎస్ పాయింట్‌పై చూపించడానికి ఆధారమైన ఉత్తర్వు ఏది?
3. ఈ పాయింట్‌ను చేర్చడానికి లేదా అమలు చేయడానికి ఎవరు, ఎప్పుడు ఆమోదం తెలిపారు?
4. ఎంపిక కమిటీ మినిట్స్‌లో 28-ఈ.డెబ్యూ.ఎస్ పాయింట్ ఎలా నమోదు చేశారు?
5. ఎస్టీ కేటగిరీలో రెండు ఖాళీలకు సంబంధించి రెండో పోస్టును భర్తీ చేయకపోవడానికి కారణమేంటి?

అధికారిక పత్రాల్లో కనిపిస్తున్న ఈ వ్యత్యాసాలపై కేయూ ఉన్నతాధికారులు పూర్తి వివరాలను వెల్లడించాలి. నియామక ప్రక్రియ నిబంధనలకు అనుగుణంగా జరిగిందని నిర్ధారించే రికార్డులను అందుబాటులో ఉంచాలనీ విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.

త్వరలో…..
అసలు సూత్రధారులు ఎవరు?
ఎవరికి ఎంతెంత?

వచ్చే జోర్డార్ పత్రికలో పార్ట్‌టైం నియామకాలపై జోర్డార్ వరుస కథనాలు కొనసాగుతాయి….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *